ప్రముఖ అష్టావధాని మాచిరాజు శివరామరాజు మృతి
కర్నూలు(కల్చరల్): ప్రముఖ అష్టావధాని మాచిరాజు శివరామరాజు(70) శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో మరణించారు. చాగలమర్రికి చెందిన ఆయన దాదాపు 112 అవధానాలు పూర్తిచేసి ఎంతోమంది శిష్యులను తీర్చిదిద్దారు. గురువారం కర్నూలు టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన అష్టావధానంలో ఆయన పాల్గొన్నారు. 24 గంటలు గడవక మునుపే ప్రాణాలు కోల్పోవడం సాహితీ లోకాన్ని కన్నీరు పెట్టిస్తోంది. ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటని అవధాని రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. మాచిరాజు కవితా మాధుర్యాన్ని తెలుగు పాఠకులు ఎన్నటికీ మరిచిపోలేరని మరో ప్రముఖ పద్యకవి బాలన్న అన్నారు. తెలుగు కళాస్రవంతి అధ్యక్షులు డాక్టర్ ఎంపీఎం.రెడ్డి, కార్యదర్శి ఎస్ఎస్ పటేల్, కార్యాధ్యక్షులు ఇనాయతుల్లా, కర్నూలు కవులు మారేడు రాముడు, శ్రీనివాసులు తదితరులు మాచిరాజు మృతి పట్ల సంతాపం ప్రకటించారు.