మళ్లీ రెచ్చిపోయిన బొకోహరాం
- ఈశాన్య నైజీరియాలోని మూడు గ్రామాల్లో ఊచకోత
- 30 మంది హతం, 20 మందికి గాయాలు, ఇళ్ల కాల్చివేత
కానో: పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో బొకోహరాం ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. మూడు గ్రామాలపై దాడిచేసి 30 మంది అమాయకపౌరులను పాశవికంగా చంపేశారు. మరో 20 మందిని తీవ్రంగా గాయపరిచారు. దీంతో మిగతా గ్రామస్తులు ప్రాణభయంతో ఇళ్లను వదిలి పరుగులు తీశారు. ఆతర్వాత ఉగ్రవాదులు ఇళ్లను తగలబెట్టి వెళ్లిపోయారు.
శనివారం చోటుచేసుకున్న ఈ మారణహోమం వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈశాన్య నైజీరియా రాష్ట్రం బురా షికాలోని వర్వారా, మంగారి, బురాషికా గ్రామాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఉగ్రమూకలు.. దొరికినవాళ్లను దొరికినట్లు పెద్దపెద్ద తల్వార్లతో గొంతులు కోశారని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయకపోవడం వల్లే ఈ సంఘటన గురించి ప్రపంచానికి ఆలస్యంగా తెలిసిందని బొకోహరాంకు వ్యతిరేకంగా పోరాడుతున్న పౌరులు చెప్పుకొచ్చారు. గత గురువారం చోటుచేసుకున్న మరో సంఘటనలో కమూవా గ్రామానికి చెందిన 14 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. 2009తో అంతర్యుద్ధం మొదలైనప్పటినుంచి బొకోహరాం ఉగ్రవాదులు 17వేల మందిని ఊచకోతకోశారు.