విడుదలకు ముందే నెట్లో ‘మనం’ ఆడియో
సినిమా పోస్టర్‌తో సహా యూట్యూబ్‌లో ప్రత్యక్షం
ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పైరసీ భూతం గుప్పిట్లో అల్లాడుతున్న టాలీవుడ్‌కు మరో షాక్ తగిలింది. ఇటీవల విడుదల కాకముందే ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని దృశ్యాలు బయటికి రాగా... ఇప్పుడు ‘మనం’ సినిమాలోని ఒక పాట ఆడియో నెట్లోకెక్కింది. ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఆఖరి చిత్రమైన.. ‘మనం’ సినిమాలోని ఈ పాట లీక్ కావడంపై చిత్రం యూనిట్ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులు విద్యార్థులే కావడంతోపాటు ఈ చిత్ర హీరో నాగార్జున అభిమానులు కావడం గమనార్హం. ‘మనం’ చిత్రం ఆడియోకు సంబంధించిన రికార్డింగ్ తదితర కార్యక్రమాలు హైదరాబాద్‌లోని వెంకటగిరిలో ఉన్న సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ స్టూడియోలో జరుగుతున్నాయి.
ఈ చిత్రం ఆడియో ఇంకా విడుదల కాలేదు. కానీ, ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌తో పాటు ఒక పాట యూట్యూబ్‌లో ఉన్నట్లుగా చిత్ర నిర్మాణ యూనిట్‌కు తెలియడంతో.. వారు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సైబర్‌క్రైమ్ ఇన్స్పెక్టర్ పి.రాజు నేతృత్వంలో సాంకేతిక దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి గుంటూరుకు చెందిన విద్యార్థి ముబషిర్ షేక్‌కు చెందిన యూట్యూబ్ అకౌంట్ నుంచి ఆ పోస్టర్, పాట ఆడియో అప్లోడ్ అయినట్లు గుర్తించారు. ముబషిర్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నాగార్జున అభిమానులు కలిసి ఫేస్బుక్లో ఓ పేజీని ప్రారంభించామని చెప్పారు. అందులో ‘మనం’ చిత్రంలోని పాట కావాలంటే ఫోన్ నంబర్లు పంపాలంటూ వచ్చిన ఒక పోస్ట్‌కు ఆకర్షితుడినై తన సెల్‌ఫోన్ నంబర్ పోస్ట్ చేశానని చెప్పాడు. తరువాత గుంటూరు జిల్లాకే చెందిన షేక్ అబిద్ బాషా సెల్ నుంచి వాట్స్‌యాప్ ద్వారా పాట షేర్ అయిందని వివరించాడు. దీంతో అబిద్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్టూడియో నుంచి ఈ పాట ఎలా బయటకు వచ్చిందనే అంశంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ‘ఇంటిదొంగల’ ప్రమేయం కోణంలో ఆరా తీస్తున్నారు.