మయన్మార్‌లో ముగిసిన ఎన్నికలు
భారీగా పోలింగ్, కౌంటింగ్ ప్రారంభం
సూచీ పార్టీ గెలుస్తుందనే అంచనాలు
యాంగాన్: దశాబ్దాలపాటు మిలిటరీపాలనలో మగ్గిన మయన్మార్‌లో ఆదివారం పార్లమెంటు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ చరిత్రాత్మక ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. భారీగా పోలింగ్ నమోదుకావడంతో ప్రజాస్వామ్య స్థాపన కోసం ఏళ్లతరబడి అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఆంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) పార్టీ విజయబావుటా ఎగరేస్తుందని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. దీంతో ఎట్టకేలకు మిలిటరీ పాలనకు చరమగీతం పాడినట్లేనని అంటున్నారు.
ఈ ఎన్నికల్లో 80 శాతానికిపైగా పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రాథమికంగా అంచనా వేసింది. దీంతో విపక్ష ఎన్ఎల్డీ మెజారిటీపై ఆశలు పెట్టుకుంది. ఆదివారం యాంగాన్‌లో సూచీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియడంతో కౌంటింగ్‌ను ప్రారంభించారు. సోమవారం నుంచి దశల వారీగా ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రాజధాని నేపిదాలో అధ్యక్షుడు, జుంటా జనరల్ థీన్ సేన్ (యూనియన్ సాలిడారిటీ, డెవలప్మెంట్ పార్టీ) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.