ఆసీస్ కెప్టెన్‌గా వార్నర్.. ఫించ్ మద్దతు కూడా ఇతనికే..!
ఆసీస్ వన్డే కెప్టెన్‌గా ఆరోన్ ఫించ్ వైదొలిగిన నేపథ్యంలో ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న డిస్కషన్ ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో జోరుగా సాగుతుంది. కొందరేమో టెస్ట్ సారధి పాట్ కమిన్స్‌కే వన్డే కెప్టెన్సీ కూడా కట్టబెట్టాలని అంటుంటే.. మరికొందరేమో వెటరన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ పేరును సూచిస్తున్నారు. పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా ఉండేందుకు వార్నర్ సైతం ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే, 2018 బాల్ టాంపరింగ్ వివాదంలో వార్నర్‌పై జీవితకాల నిషేధం (కెప్టెన్సీ విషయంలో) ఉన్న నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఏ విధంగా స్పందిస్తుందో వేచి చేడాల్సి ఉంది. సమస్యను పరిష్కరించుకునేందుకు (బ్యాన్ ఎత్తివేత) డేవిడ్ భాయ్ స్వయంగా రంగంలోకి దిగి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో అతనికి తాజాగా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అలాగే పలువురు క్రికెట్ ఆస్ట్రేలియా పెద్దల మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఫించ్ స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి ఫార్మాట్ నుంచి కూడా వైదొలుగుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసమే వార్నర్ కూడా ఎదురుచూస్తున్నాడని అతని సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మెగా టోర్నీ తర్వాత ఫించ్ పొట్టి ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటే.. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ మొత్తం కోసం పావులు కదపాలన్నది వార్నర్ ప్లాన్‌గా తెలుస్తుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వార్నర్ టీ20 వరల్డ్‌కప్ అనంతరం ఆసీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం ఖాయమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.