బస్సు, ఆటో ఢీ : ముగ్గురి మృతి
ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
కర్నూలు(హాస్పిటల్): బస్సు-ఆటో ఢీకొని ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం రాత్రి ఈ సంఘటన కర్నూలు శివార్లలోని వెంకాయపల్లె సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు..కర్నూలు మండలం పడిదెంపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రాజేష్(28), నాగమద్దిలేటి(42), జయసూర్య(13), మరో ఇద్దరు ప్రయాణికులతో కర్నూలు నుంచి ఆటోలో వెళ్తుండగా రాత్రి 8.30 గంటల సమయంలో లొద్దిపల్లె గ్రామానికి వెళ్లే క్రాస్‌రోడ్డు వద్ద విజయవాడ నుంచి కర్నూలుకు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆటోడ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
ఆస్పత్రికి తరలిస్తుండగా నాగమద్దిలేటి మార్గమధ్యంలో మృతి చెందాడు. జయసూర్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సుంకులమ్మ, నాగేశ్వరమ్మను 108లో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. నాగేశ్వరమ్మ పరిస్థితి విషమంగా ఉంది. సుంకులమ్మ రాయలసీమ యూనివర్సిటీ హాస్టల్లో వర్కర్‌గా పనిచేస్తోంది. ప్రమాదంలో మృతిచెందిన జయసూర్య కర్నూలులోని శ్రీచైతన్య స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల వదలగానే సి.క్యాంప్ నుంచి ఆటోలో వెళ్తూ ప్రమాదబారిన పడ్డాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఈ ప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది.
ఎమ్మెల్యేల పరామర్శ
ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. తీవ్రంగా గాయపడిన మహిళలకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను కోరారు. కర్నూలు ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి కూడా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనకు కారణమైన బస్సు వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు.