పదేళ్లలో సంపద 400 శాతం వృద్ధి
భారతీయుని సగటు ఆర్జనపై న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక
న్యూఢిల్లీ: భారతీయుని సగటు సంపద 2005-15 మధ్య కాలంలో 400 శాతం పెరిగిందని న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ఒకటి పేర్కొంది. ఇదే కాలంలో యూరోపియన్ సిటిజన్ ఆర్జనలో అసలు వృద్ధిలేకపోగా 5 శాతం క్షీణించిందని తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే...
♦ భారత్, చైనా, వియత్నాం వంటి వర్ధమాన దేశాల్లో పౌరుని సగటు సంపద 400 శాతం పెరిగింది. ఆస్ట్రేలియా విషయంలో సంపద పెరుగుదల రేటు 100 శాతంగా ఉంది. కెనడాకు సంబంధించి ఈ రేటు 50 శాతం.
♦ ఒక వ్యక్తి మొత్తం ఆస్తుల్లోంచి రుణాలు తీసివేయగా వచ్చే నికర ఆస్తిని ‘సంపద’గా నివేదిక పేర్కొంది. ఆస్తి, నగదు, ఈక్విటీ, వాణిజ్య ప్రయోజనాలను ‘ఆస్తి’గా లెక్కలోకి తీసుకుంది.
♦ యూరోప్ నుంచి పలువురు సంపన్నులు అమెరికా, కెనడా, న్యూజిలాండ్, కరేబియన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వలసపోవడం యూరోప్‌లో సంపద సృష్టికి విఘాతం ఏర్పడింది. దీనితోపాటు 2008 ప్రపంచ ఆర్థిక, హౌసింగ్ సంక్షోభాలు సైతం యూరోప్‌కు ప్రతికూలంగా మారాయి. ఆదాయపు పన్ను రేట్లూ పెరిగాయి. చైనా, భారత్, శ్రీలంక, ఫిలిప్పైన్స్, వియత్నాం వంటి దేశాల్లో పలు రంగాలు ప్రత్యేకించి తయారీ రంగం బలపడుతుండడం పరోక్షంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం పడింది. ప్రపంచ మార్కెట్లో ఏర్పడిన పోటీలో యూరోపియన్ దేశాలు నిలబడలేకపోయాయి. పలు కంపెనీలు మూతబడ్డాయి. ఉపాధి అవకాశాలు తగ్గాయి.