కొత్తపేట.. ఉత్తమ పంచాయతీ
పురస్కారం అందుకున్న సర్పంచ్ అనురాధ
కొత్తపేట :
స్వచ్ఛ భారత్ పథకాల లక్ష్య సాధనలో కొత్తపేట గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉత్తమ పంచాయతీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం, వ్యక్తిగత మరుగుదొడ్ల (ఐఎస్ఎల్) నిర్మాణంలో లక్ష్య సాధనతో పాటు, ఘనవ్యర్థాల నిర్వహణ ద్వారా వర్మీ కంపోస్టు తయారీ కేంద్రం నిర్మాణం వంటి కార్యక్రమాలు పరిగణలోకి తీసుకుని కొత్తపేటను ఉత్తమ పంచాయతీగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆదివారం విజయవాడలో కృష్ణా పుష్కరాలు– 2016 వేదికపై ప్రభుత్వం తరపున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని సర్పంచ్ మిద్దే అనురాధ, ఆమె భర్త పంచాయతీ సభ్యుడు మిద్దే ఆదినారాయణ అందుకున్నారు. పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, కమిషనర్ రామాంజనేయులు వున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ అనూరాధ దంపతులను ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఎంపీపీ రెడ్డి అనంతకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు దర్నాల రామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ బండారు వెంకటసత్తిబాబు, ఎంపీడీఓ పి వీణాదేవి తదితరులు అభినందించారు.