చెన్నైలో బాబు దిష్టిబొమ్మ దహనం
మీడియాకు ముఖం చాటేసిన ఏపీ మంత్రి గంటా
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎర్ర చందనం కూలీల పేరుతో ఏపీ పోలీసులు 32 మంది తమిళ కూలీలను అరెస్ట్ చేయడం, పాలారు జలాశయంలో చెక్‌డ్యాంల ఎత్తు పెంపునకు నిరసనగా తమిళర్ మున్నేట్రపడై నేతలు సోమవారం చెన్నైలో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరు కోయంబేడులో చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను ముట్టడించేందుకు యత్నించారు. దీంతో బస్‌స్టేషన్ చుట్టూ పోలీసులు మోహరించారు. కృష్ణ పుష్కరాలకు ఏపీ ప్రభుత్వం తరఫున డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని ఆహ్వానించేందుకు సోమవారం చెన్నైకి వచ్చిన ఏపీ విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. చెన్నై విమానాశ్రయంలో మంత్రిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టారు. ప్రశ్నల వర్షం కురిపించారు.