అమ్మానాన్నను కోల్పోయిన చోటుకి 9 ఏళ్ల తర్వాత..
సాక్షి, ముంబై: బేబీ మోషే గుర్తున్నాడు.. 2008 నవంబర్ 26న పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబైలో జరిపిన మారణహోమంలో మోషే తన తల్లిదండ్రులను కోల్పోయాడు. ఇప్పుడు తొమిదేళ్ల తర్వాత మోషే హోల్ట్జ్‌బర్గ్ మళ్లీ ముంబై గడ్డపై అడుగుపెట్టాడు. రెండేళ్ల కిందట తాను 13వ ఏట అడుగుపెట్టినప్పుడే మోషే ముంబై రావాలనుకున్నాడు. కానీ అప్పుడు కుదరలేదు. గత ఏడాది ప్రధాని నరేంద్రమోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించినప్పుడు మోషేను ముంబై రావాల్సిందిగా ఆహ్వానించారు.
సంరక్షకురాలు సాండ్రా శామ్యూల్‌తో కలిసి మంగళవారం ఉదయం మోషే ముంబై చేరుకున్నాడు. అతను మరికాసేపట్లో నారీమన్ హౌజ్‌ను సందర్శించబోతున్నాడు. ముంబై దాడుల్లో భాగంగా ఉగ్ర ముష్కరులు ఇక్కడ నరమేథం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక్కడే చాబాద్ హౌజ్‌లో ఉన్న మోషే ఇంటిపై కూడా ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రమూక దాడి బారిన పడకుండా ఆ సమయంలో సాండ్రా చిన్నారి మోషేను కాపాడింది. ఉగ్రవాదుల కాల్పుల నుంచి తప్పించుకుంటూ మోషేను ఎత్తుకొని బయటకు పరిగెత్తింది. అయితే, ఈ దాడిలో మోషే తల్లిదండ్రులు హతమయ్యారు. దీంతో రెండేళ్ల వయస్సులో ఉన్న మోషేను రక్షణార్థం అతని నానమ్మ-తాతయ్య ఇజ్రాయెల్‌లోని అఫుల నగరానికి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల కిరాతక హింసకు బాధితులైన అమాయకులకు ప్రతీకగా మోషే అప్పట్లో నిలిచాడు.
ఇది ఒకప్పటి ముంబై కాదు..!
మోషే ముంబైకి రావడం ఎంతో భావోద్వేగ సందర్భమని, ఎంతో సున్నితమైన అంశమని యూదుల కేంద్రం చాబాద్ హౌజ్‌ను నడిపించే రబ్బి ఇజ్రాయెల్ కోజ్లోవ్స్కీ అన్నారు. మోషేను కలిసేందుకు ఎంతో ఉత్సుకతతో ఉన్నామని, అతను ఇప్పటికీ తమ హృదయాల్లో చిన్నారి బాలుడేనని తెలిపారు. ఇది ఒకప్పటి ముంబై కాదని, ఇప్పుడు ఎంతో సురక్షితంగా, భద్రంగా ఈ నగరం ఉందని, మోషేని కలువబోతుండటం ఎంతో ఆనందంగా ఉందని అతని తాత రబ్బి హోల్ట్జ్‌బర్గ్ నాష్మన్ అన్నారు.