ఎమ్మెల్యేలను కొనడం అనైతికం
సాక్షి, హైదరాబాద్: ఒక పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను వేరే పార్టీ కొనడం అనైతికమని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. తెలంగాణ, ఏపీలో అధికార పార్టీలు విపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై స్పందిస్తూ... ‘‘ఇది చాలా చెడు సంప్రదాయం. ప్రజాస్వామ్యాన్ని పరిహసించేలా వ్యవహరించడం మంచిది కాదు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొనడం, రాజ్యసభ సీటు ఇస్తామని ప్రలోభపెట్టడం, ఇతరత్రా అవసరాల కోసం కొనుగోలుకు దిగడం దుస్సంప్రదాయం.
ఇలాంటివారు తాత్కాలిక ప్రయోజనం కోసం ప్రజాస్వామ్యానికే పెద్ద నష్టం కలిగిస్తున్నారు. ఈ పని ఏ పార్టీ చేసినా మంచిది కాదు’’ అని అన్నారు. ఏపీలో టార్గెట్ పెట్టి మద్యం అమ్మకాలు జరుపుతున్నారని, మద్యపాన నిషేధం అమలు చేసిన ఎన్టీఆర్ ఆత్మకు చంద్రబాబు ద్రోహం చే స్తున్నారని వ్యాఖ్యానించారు. కేరళ, బిహార్ వంటి రాష్ట్రాలు మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తుంటే.. ఏపీలో చంద్రబాబు మద్యం అమ్మకాలపై టార్గెట్లు విధించడం దారుణమంటూ తప్పుపట్టారు.
కొత్త రాష్ట్రాన్ని కొత్త ఆలోచనలతో అభివృద్ధి చేసుకోవాలే తప్ప చెడు మార్గాన వెళ్లకూడదని ఉద్బోధించారు. ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ సంస్థలు విద్యాలయాలను తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రోహిత్ ఆత్మహత్య, బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ సందీప్పాండేను తొలగించడం, జేఎన్యూ పరిణామాలన్నీ మతతత్వ ,ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణ వాద పోకడలను విశ్వవిద్యాలయాలపై రుద్దేందుకు జరుగుతున్న ప్రయత్నాలేనని చెప్పారు. చివరికి నెహ్రూ కలల యూనివర్సిటీ జేఎన్యూనే దేశద్రోహుల అడ్డాగా చిత్రీకరించే ప్రయత్నానికి ఒడిగట్టడం శోచనీయమని పేర్కొన్నారు.