అదే దమ్ము.. అదే ఎనర్జీ!
ఆ రోజు భక్తవత్సలం నాయుడు మనసంతా ఉద్వేగంగా ఉంది. ‘స్వర్గం-నరకం’లో ప్రతినాయకుడి పాత్ర కోసం ఆడిషన్స్ చేసినవాళ్లల్లో అందరికీ సిఫార్సులున్నాయి. కానీ, భక్తవత్సలంకి గాడ్ ఫాదర్ లేరు. ప్రతిభ మీద నమ్మకంతో భక్తవత్సలం నాయుడు ఆడిషన్స్‌లో పాల్గొన్నారు. కానీ, అతని మీద కోపంగా ఉన్న అసిస్టెంట్ డెరైక్టర్ ఎంతో కసిగా ఆ ఫుటేజ్ దాచేశాడు. విధి విచిత్రమైంది. ఆ అసిస్టెంట్ డెరైక్టర్ ఒకటి తలిస్తే, దైవం వేరే తలచింది. ఆడిషన్స్‌లో పాల్గొన్నవారిలో ఎవరి నటనా చిత్ర దర్శకుడు దాసరి నారాయణరావుకు సంతృప్తి అనిపించలేదు. అప్పుడాయన తన సతీమణి పద్మతో ‘భక్త టెస్ట్ షూట్ చూశావా?’ అనడిగారు.
అసిస్టెంట్ డెరైక్టర్ దాచేసిన ఫుటేజ్ అప్పుడు బయటికొచ్చింది. ఆ ఫుటేజ్‌లో భక్తవత్సలం నటన దాసరి పద్మకు బాగా నచ్చింది. ‘కుర్రాడు బాగున్నాడు.. బాగా నటించగల సత్తా ఉంది’ అని సర్టిఫికెట్ ఇచ్చారు. దాసరి కూడా భక్తవత్సలం ప్రతిభను నమ్మారు. అంతే.. ‘స్వర్గం-నరకం’లో ప్రతినాయకుడి పాత్రకు ఎంపిక చేసేశారు. అలాగే, భక్తవత్సలం నాయుడు పేరుని ‘మోహన్‌బాబు’గా మార్చేశారు. ఇది జరిగి సరిగ్గా 40 ఏళ్లయ్యింది. ఇన్నేళ్లల్లో ప్రతినాయకుడిగా, నాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా మోహన్‌బాబు తిరుగు లేదనిపించుకున్నారు. ఆయన సంభాషణలు పలికే తీరును ప్రేక్షకులు ‘భేష్’ అన్నారు.
ఏ పాత్ర చేసినా ఒదిగిపోయిన వైనానికి ముచ్చటపడ్డారు. దర్శక, నిర్మాతలందరికీ ‘మోస్ట్ వాంటెడ్ ఆరిస్ట్’ అయిపోయారు. ఇన్నేళ్ల నట జీవితం తర్వాత మోహన్‌బాబులోని నటుడు ఇంకా అదే ‘ఉత్సాహం’తో ఉన్నాడు. వచ్చిన కొత్తల్లో ఉన్న ఎనర్జీ, ఉత్సాహం, ఉద్వేగం ఏ మాత్రం తగ్గలేదు. అందుకు ఉదాహరణ - గత ఏడాది విడుదలైన ‘పాండవులు పాండవులు తుమ్మెద’, ‘రౌడీ’, ‘యమలీల 2’ చిత్రాలు. ‘రౌడీ’లో విగ్గు లేకుండా తన సహజ ధోరణిలో కనిపించడంతో పాటు, అందులో ‘అన్న’ పాత్రను అద్భుతంగా చేశారు మోహన్‌బాబు.
సత్తా ఉన్న నటుడికి సరైన పాత్రలు దొరికితే పరకాయ ప్రవేశం చేసేస్తారు. అందుకు ఓ ఉదాహరణ మోహన్‌బాబు. ఇవాళ ఆయన జన్మదినం. గత కొన్నేళ్లుగా తిరుపతిలోని తన శ్రీవిద్యానికేతన్ విద్యాలయంలో విద్యార్థినీ, విద్యార్థుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారాయన. ఈ ఏడాది కూడా మోహన్‌బాబు అక్కడే జరుపుకొంటున్నారు.