అది ఉగ్రవాదుల దాడే: కిరెన్ రిజ్జూ
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆదివారం చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని హోంశాఖ స్పష్టం చేసింది. సోమవారం మీడియాతో మాట్లాడిన హోంశాఖ సహోయమంత్రి కిరణ్ రిజ్జూ.. ఆ దాడి ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిందేనని తెలిపారు. అయితే ఆ బాంబు దాడి ప్రభావం తక్కువ ఉండటంతో పెద్దగా ప్రాణం నష్టం జరగలేదన్నారు. ఆ దాడి వెనుక సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు సాగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నగరంలోని చర్చిస్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మరణించిగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్టారెంట్‌కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్ల పొదల్లో ఈ బాంబ్‌ను అమర్చినట్లు పోలీసులు తెలిపారు.