నాడు జెయింట్ కిల్లర్.. నేడు?
అవి.. చిరంజీవి కొత్తగా ప్రజారాజ్యం పార్టీ పెట్టిన రోజులు. చిరంజీవి సొంతూరు పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు కాగా, ఆయన అత్తవారి ఊరు ఆ పక్కనే ఉండే పాలకొల్లు. చిరంజీవి తన అత్తవారి ఊరైన పాలకొల్లుతో పాటు ఎందుకైనా మంచిదని తిరుపతి నుంచి కూడా అసెంబ్లీకి పోటీ చేశారు. తాను పుట్టి పెరిగిన జిల్లా కావడం, అత్తవారి ఊళ్లో ముందునుంచి స్థానబలం ఉండటంతో పాలకొల్లులో సులభంగా గెలవగలనని భావించారు. ప్రచారం మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున బంగారు ఉషారాణిని అభ్యర్థినిగా రంగంలో నిలిచారు. ఆమె మీద అప్పట్లో అంతగా అంచనాలు కూడా లేవు.
ఎన్నికలు జరిగాయి. చిరంజీవి రెండుచోట్లా బంపర్ మెజారిటీతో గెలుస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఫలితం తలకిందులైంది. తన సొంత ఊరి లాంటి పాలకొల్లులో చిరంజీవి ఓ మహిళ చేతిలో దారుణంగా ఓడిపోయారు. అది కూడా ఏదో అంతంత మాత్రం మెజారిటీ కాదు.. ఐదు వేలకు పైగా ఓట్ల తేడా! దాంతో ఒక్కసారిగా బంగారు ఉషారాణి పేరు రాష్ట్ర రాజకీయాల్లో మార్మోగిపోయింది. జెయింట్ కిల్లర్ ఉషారాణి అంటూ జాతీయ మీడియా కూడా అప్పట్లో ఆమె గురించి రాసింది. ఆ ఎన్నికల్లో ఉషారాణికి 49,720 ఓట్లు రాగా, రెండో స్థానంలో నిలిచిన చిరంజీవి 44,274 ఓట్లు మాత్రమే పొందగలిగారు. అంటే, వీరిద్దరి ఓట్ల మధ్య తేడా 5,446 అన్నమాట. మూడో స్థానంలో ఉన్న టీడీపీ అభ్యర్థి సీహెచ్ సత్యనారాయణ మూర్తి (డాక్టర్ బాబ్జీ)కి 29,371 ఓట్లు వచ్చాయి.
తర్వాత క్రమంగా ఆమెకు ప్రజలతో సంబంధాలు తగ్గిపోయాయి. పెద్దగా జనంలో తిరగలేదు. తనకు కావల్సిన వాళ్లకు పదవులు ఇప్పించుకోడానికి మాత్రం ప్రయత్నించారన్న విమర్శలు ఎక్కువగా వచ్చాయి. తనకు సలహాదారుగా వ్యవహరించిన ఓ మాజీ పాత్రికేయుడికి నామినేటెడ్ పదవి ఇప్పించుకోవడంలో ఆమె సఫలీకృతులయ్యారు. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఒకవేళ ఉషారాణికి టికెట్ రాకపోతే తాను పోటీ చేస్తానంటూ అదే వ్యక్తి ఉత్సాహం చూపుతున్నారని వినికిడి. ఉషారాణి మాత్రం పోటీ చేసినా ఈసారి ఎన్నోస్థానంలో ఉంటారనేది అనుమానమేనని స్థానికులు అంటున్నారు. డిపాజిట్ దక్కకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని చెబుతున్నారు. జెయింట్ కిల్లర్ కాస్తా.. ఈసారి నామమాత్రంగా మిగిలిపోతారని వినిపిస్తోంది.