మార్కెట్లు అక్కడక్కడే
ఎట్టకేలకు మార్కెట్లు కొంతమేర నీరసించాయి. గత నాలుగు రోజుల్లో దాదాపు 1,550 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ బుధవారం వెనకడుగు వేసింది. రోజంతా స్వల్ప స్థాయిలో ఒడిదుడుకులకు లోనై చివరికి 56 పాయింట్లు నష్టపోయింది. 23,815 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా 60 పాయింట్ల స్థాయిలో హెచ్చుతగ్గులను చవిచూసింది. చివరికి 7,109 వద్దే యథాతథంగా నిలిచింది. మార్కెట్లు మందగించినప్పటికీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లు దుమ్ముదులిపాయి. వీటిలో ప్రభుత్వ వాటాను 50%కంటే తక్కువకు పరిమితం చేయాలంటూ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన కమిటీ సూచించడం ఇందుకు దోహదపడింది. కాగా, గడిచిన మూడు రోజుల్లో రూ. 4,500 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 1,520 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయడం విశేషం! దేశీ ఫండ్స్ మాత్రం రూ. 410 కోట్ల అమ్మకాలు చేపట్టాయి.
కెనరా బ్యాంక్ 11% అప్
ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజాలు కెనరా, ఇండియన్ బ్యాంక్‌లు అత్యధికంగా 11% దూసుకెళ్లగా... సెంట్రల్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐవోబీ, ఆంధ్రా బ్యాంక్, బీవోబీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో, అలహాబాద్, ఐడీబీఐ, సిండికేట్ బ్యాంక్, పీఎన్బీ, దేనా బ్యాంక్ 10-4% మధ్య పురోగమించాయి. ఇక సెన్సెక్స్‌లో టాటా స్టీల్ 6% జంప్‌చేయగా, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, సెసాస్టెరిలైట్, ఐటీసీ 3.4-1.3% మధ్య లాభపడ్డాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ ద్వయం, ఆర్ఐఎల్ 3.5-1.5% మధ్య క్షీణించాయి.
రియల్టీ జోష్
బీఎస్ఈలో రియల్టీ అత్యధికంగా 4% జంప్‌చేయగా, మెటల్ ఇండెక్స్ 3% పుంజుకుంది. యూనిటెక్, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, ప్రెస్టీజ్, హెచ్‌డీఐఎల్, డీబీ, అనంత్‌రాజ్ 9-4% మధ్య దూసుకెళ్లాయి. కాగా, మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 1.2% చొప్పున లాభపడ్డాయి.