పడతుల పాటశాల
బతుకమ్మ.. పూలు పేర్చే పండుగ మాత్రమే కాదు, తరుణుల ఆలోచనకు వేదిక . స్త్రీల సృజనాత్మకతను కళ్ల ముందు నిలిపే శుభ సందర్భం. బతుకమ్మ ఆటపాటలంటే.. ఆడవాళ్లకు అందివచ్చిన ఆటవిడుపు కాదు. అమ్మలక్కల సొదలు చెప్పుకునే కాలక్షేపం అంతకన్నా కాదు. బతుకమ్మ పాట ఓ చారిత్రక నేపథ్యం. తరతరాలు దాటుకొచ్చిన ఆ జనపదాలు సామాజిక స్పృహ కలిగించే జ్ఞాన గుళికలు. ఇలాంటి బతుకమ్మ పండుగ ప్రాశస్త్యాన్ని తన నవలలో వివరించారు ప్రముఖ రచయిత్రి, రిటైర్డ్ ప్రొఫెసర్ ముదిగంటి సుజాతారెడ్డి.. బతుకమ్మ పాటలు.. వాటి వెనుకనున్న మహిళల సామాజిక కోణం గురించి ఆమె చెప్పిన విశేషాలు...
బతుకమ్మ పండుగ స్త్రీల సృజనకు ప్రతిరూపం. వాళ్ల కళాత్మకతకు నిదర్శనంగా కనిపిస్తుంది. వాళ్ల అభిరుచికి అద్దం పడుతుంది. బతుకమ్మను పేర్చడంలో ఇవన్నీ కనిపిస్తాయి. పొలిమేరలు దాటిన వర్షరుతువు గునుగు, తంగేడు, కట్లపూలు, గోరింట పూలను బతుకమ్మ కోసమే ఇచ్చి వెళ్తుంది. ఈ సీజన్లో దొరికే పూలన్నీ బతుకమ్మకు శ్రేష్టమే. బతుకమ్మను తీర్చిదిద్దడంలో ఏ పూల తర్వాత వేటిని పేర్చాలనేది కూడా ఇంపార్టెంటే. ఇందులోనే కలవారి కోడళ్ల కళాత్మకత దాగి ఉంటుంది. ఆడపడుచుల
అభిరుచి కనిపిస్తుంది. అయితే బంగారు బతుకమ్మ అంటారు కాబట్టి బతుకమ్మలో పచ్చపూలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు.
పాటలు.. పాఠాలు..
బతుకమ్మ అలంకరణ, ఆట ఒకెత్తయితే.. బతుకమ్మ పాటలు పాడటం ఒక్కటీ ఒకెత్తు. బతుకమ్మ పాటలన్నీ జనపదాలే.. స్త్రీ గాథలే. పురాణేతిహాసాలు మొదలు.. సాంఘిక ఘట్టాలు వినిపించిన బతుకమ్మ పాటలు చాలా వరకు మహిళల కథలు, వ్యథలు, బాధలే. అయితే ఈ గాథల్లో లోతైన అర్థం ఉంది. తర్వాతి తరం స్త్రీలకు స్థైర్యాన్ని పెంచేవి. బతుకమ్మ ఆటపాటల్లో అన్ని తరాల ఆడవాళ్లు పాల్గొంటారు. పెద్ద తరం ఆడవాళ్లు తమ పాటలను వినిపిస్తూ.. తర్వాతి తరం వాళ్లకు సమాజంపై అవగాహన, జాగరూకతను, ఒక స్పృహను కలిగిస్తుంటారు. సీతమ్మ కథ.. ఊర్మిళ వ్యథ.. ఫలానా ఊళ్లో ఒక అమ్మాయి గాథ.. అక్కాచెల్లెళ్ల కష్టాలు.. పాట రూపంలో చెప్పడం అంటే సమాజంలో స్త్రీ స్థానాన్ని వివరించడమే. ఈ పాటలనే పాఠాలుగా తీసుకుని తర్వాత తరం వాళ్లు ఎలా ముందుకు కదలాలని చెప్పడమే.
‘నేటి’విటీ రేపటికివ్వాలి..
బతుకమ్మ పాటలు మగువలకు మనోధైర్యాన్ని కల్పించేవే కావు.. వర్తమాన అంశాల మీద కూడా సాగాయి. రాజకీయ, సామాజిక కోణాలను స్పృశించాయి. రజాకార్లను ఎదిరించిన నక్క ఆండాళమ్మ, రేణిగుంట రామిరెడ్డి పోరాటాలు.. 1960లో వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో జరిగిన రైలు దుర్ఘటనలాంటి ఎన్నో సంఘటనలను బతుకమ్మ పాటలుగా మలచారు. అయితే ఆ ప్రయత్నం అంతటితోనే ఆగిపోయిందన్న సందేహం వేస్తోంది. కాలం మారినా స్త్రీ పరిస్థితుల్లో మార్పు రాలేదు. బాధ్యతలు పెరిగాయి.. బాధలూ పెరిగాయి. నేటి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉనికి కోసం వారు పోరాడుతున్న వైనాన్ని బతుకమ్మ పాటలుగా ఎక్కడా వినిపించడం లేదు. ఒకప్పుడు బతుకమ్మ ఊరంతా ఒక్కటి చేసే సందర్భం. ఇప్పుడు మొక్కుబడి కార్యక్రమంగా మారింది. అందుకే నేటి కాలమాన పరిస్థితులకు అద్దం పట్టే పాటలు రావడం లేదేమో. ఈ తరం వనితా లోకాన్ని ప్రస్ఫుటించే పాటలు వస్తే తర్వాత తరాలకు ఓ చరిత్ర అందించినట్టు అవుతుంది.
- సరస్వతి రమ