ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో అన్యాయం
- రైతన్నల కన్నెర్ర - జాతీయ రహదారిపై రాస్తారోకో
- వ్యవసాయాధికారిని చుట్టుముట్టిన రైతులు
బత్తలపల్లి (ధర్మవరం ): ఇన్పుట్ సబ్సిడీ పంపిణీలో అన్యాయం జరిగిందని బత్తలపల్లి మండలంలోని రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. శనివారం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై బైఠాయించి, రెండు గంటల పాటు ఆందోళన చేపట్టారు. బత్తలపల్లి మండలంలోని 10,775 మంది రైతులకు రూ.19.17 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో దాదాపు 7,500 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ మొత్తాన్ని జమ చేయడానికి ట్రెజరీకి పంపినట్లు వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అయితే మండలంలోని మాల్యవంతం పంచాయతీకి చెందిన ఐదు గ్రామాల పరిధిలో దాదాపుగా 1,500 మంది రైతులకు ఖాతాలు ఉన్నాయి. వీరిలో వంద మంది రైతులకు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ మొత్తం జమ అయ్యింది. మిగిలిన రైతుల ఖాతాల్లో జమ కాలేదు. అందులోనూ రావాల్సిన మొత్తం కంటే తక్కువగా ఖాతాల్లో జమ అయ్యింది.
బాధితులందరూ వ్యవసాయ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడా అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆగ్రహించారు. వ్యవసాయాధికారి పెన్నయ్య, ఎంపీఈఓను బత్తలపల్లి కూడలికి తీసుకొచ్చారు. రైతులతో కలిసి రోడ్డుపైన కూర్చోబెట్టి తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేదిలేదని భీష్మించుకూర్చున్నారు. అనంతరం రైతులందరూ పెద్ద ఎత్తున రెవెన్యూ, వ్యవసాయ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకొని వ్యవసాయశాఖ ఏడీఏ విశ్వనాథ్, తహసీల్దార్ గోపాలకృష్ణ అక్కడికి చేరుకొని రైతులకు సర్దిచెప్పారు. అయినా రైతులు ఆందోళన విరమించలేదు. సీపీఐ నాయకులు సీపీఐ నాయకులు కమతం కాటమయ్య, సీపీఎం నాయకులు వడ్డె రమేష్ అక్కడికి చేరుకొని రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన సీఐ శివరాముడు రైతులు, అధికారులతో మాట్లాడారు. అర్హులందరికీ న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రెండుగంటలపాటు రాస్తారోకో చేయడంతో ట్రాఫిక్ స్తంభించింది. ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు.