అద్దె భవనాలు కావలెను!
- 119 గురుకులాలకు లభించిన భవనాలు 55 మాత్రమే
- ప్రారంభానికి ముంచుకొస్తున్న ముహూర్తం
- తల పట్టుకుంటున్న బీసీ సంక్షేమాధికారులు
సాక్షి, హైదరాబాద్: బీసీ గురుకులాలకు అద్దె భవనాలు లభించడంలేదు. మరోవైపు గురుకులాల ప్రారంభానికి ముహూర్తం ముంచుకొస్తోంది. 2017–18 విద్యాసంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా మహాత్మా జ్యోతిభా పూలే వెనుకబడిన తరగతులు గురుకుల విద్యాసంస్థల సొసైటీ ద్వారా 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో బీసీ గురుకుల పాఠశాల ఏర్పాటుకు భవనాలను గుర్తించే పనిలో పడ్డారు. జూన్ 12 నాటికి కొత్తగా ప్రారంభించే గురుకుల పాఠశాలలకు సకల వసతులు సిద్ధం చేయాలి. కనీసం రెండు నెలల ముందు భవనాలు లభిస్తే వాటికి సంబంధించి మరమ్మతులు, వసతుల కల్పనకు వీలుంటుంది. కానీ, కేవలం 55 భవనాలు మాత్రమే అద్దెకు లభించాయి.
తాజాగా ప్రారంభించే గురుకులాల్లో 5,6,7 తరగతులు మాత్రమే ప్రారంభించనున్నారు. ఒక్కో తరగతికి రెండు సెక్షన్ల చొప్పున, ప్రతి సెక్షన్లో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనుంది. మొత్తంగా మూడు తరగతుల్లో 240 మంది విద్యార్థుల కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల భవనం అవసరం. 12 తరగతి గదులు, 12 డార్మెటరీలు, చాలినన్ని టాయిలెట్లు, స్నానపుగదులు, కిచెన్రూమ్, డైనింగ్ హాల్, లైబ్రరీ, ప్రిన్సిపాల్ చాంబర్, కార్యాలయ గది, స్టాఫ్ రూమ్, ఆటస్థలం ఇలా అన్ని సౌకర్యాలున్న భవనాల్లోనే వీటిని ఏర్పాటు చేయాలని నిబంధనలు విధించింది. అయితే, ఇంత కఠిన నిబంధనలతో కూడిన భవనాలు గ్రామీణ ప్రాంతాల్లో లభించడం కష్టమని అధికారులు అంటున్నారు.
అక్కడలా.. ఇక్కడిలా...: గ్రామీణ ప్రాంతాల్లో నిబంధనలకు కాస్త దగ్గరగా ఉన్న భవనాలపై అధికారులు దృష్టి పెట్టారు. 20 వేల చదరపు అడుగులు ఒకే బిల్డింగ్లో కాకుండా రెండు లేదా మూడు భవనాలు ఉండేలా చూస్తున్నారు. ఈ మేరకు దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో భవనాలు లభించాయి.గ్రామీణ నియోజకవర్గాల్లో మాత్రం అద్దె భవనాల లభ్యత ఆశాజనకంగా లేదు. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో అద్దెలు విపరీతంగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చదరపు అడుగుకు రూ.3 చొప్పున మాత్రమే చెల్లించనుంది. కానీ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఈ ధరలకు అద్దె ఇళ్లు దొరకడంలేదు.