బీసీ రెసిడెన్షియల్స్ ఎంట్రెన్స్ మార్గదర్శకాలు
సాక్షి,హైదరాబాద్: వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5-8 తరగతుల (మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ) మధ్య ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. సోమవారం ఇందుకు సంబంధించి బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి డా.టి.రాధ రెండు సర్క్యులర్లను విడివిడిగా విడుదల చేశారు. 2015లో నిర్వహించే ప్రవేశపరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా విద్యార్థులను జూనియర్ కాలేజీల్లో ప్రవే శానికి ఎంపిక చేస్తారు.
ప్రస్తుత విద్యాసంవత్సరంలో పద వ తరగతి పరీక్ష రాసినవారే ప్రవేశపరీక్ష రాసేందుకు అర్హులు. సప్లిమెంటరీలో పరీక్ష పాసైన వారు, అంతకు ముందు సంవత్సరాలు పదవ తరగతి పాసైన వారు ప్రవేశపరీక్ష రాసేందుకు అనర్హులు. ఒకవేళ ఎంట్రెన్స్‌లో ఇద్దరు విద్యార్థులకు సమానమైన మార్కులు వస్తే మ్యాథ్స్ తదితర సబ్జెక్టుల్లో వచ్చే మార్కులను బట్టి ర్యాంకు నిర్ణయిస్తారు. ఇంటర్మీడియట్లో ఆంగ్ల మాధ్యమంలోనే చదువుకోవాల్సి ఉంటుంది.
రిజర్వేషన్లను బీసీ-ఏ 20 శాతం, బీసీ-బీ 28 శాతం, బీసీ-సీ3 శాతం, బీసీ-డీ 19 శాతం, బీసీ-ఈ 4 శాతం, ఎస్సీ 15 శాతం, ఎస్టీ6 శాతం, ఓఆర్పీహెచ్ 3 శాతం, ఓసీ/ఈబీసీలకు 2 శాతం రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. ఏదైనా కేటగిరిలో సీట్లు భర్తీ కాకపోతే బీసీ విద్యార్థులతో వాటిని భర్తీ చేస్తారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు, బీసీ వెల్ఫేర్ హాస్టళ్ల విద్యార్థులకు 75 శాతం సీట్లు రిజర్వ్ చేస్తారు. మిగిలిన 25 శాతం సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హాస్టళ్లు, జేడ్పీ స్కూళ్లు, ప్రైవేట్స్కూళ్లలోని వారికి కేటాయిస్తారు.