శ్రీధర్‌ను ఎలా నియమిస్తారు!
న్యూఢిల్లీ: బీసీసీఐ జనరల్ మేనేజర్ (క్రికెట్ ఆపరేషన్స్)గా హెచ్‌సీఏ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌ను నియమించడం బోర్డులో కొంత మందిలో అసంతృప్తి దారి తీసింది. చివరి వరకు ఆయన నియామకం గురించి తెలీదని శ్రీనివాసన్ వ్యతిరేక వర్గానికి చెందిన సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.
‘ఎందుకు శ్రీధర్‌ను జీఎంగా నియమించారో, ఆయన అర్హత ఏమిటో శ్రీనివాసన్ వివరణ ఇవ్వలేదు. కేవలం శ్రీకి మద్దతు ఇచ్చిన కారణంగానే ఆ పదవి దక్కింది. సమావేశం సమయంలోనే మాకు ఆ విషయం తెలిసింది’ అని ఆయన అన్నారు. అయితే మరో సభ్యుడు దీనిని కొట్టి పారేశారు. ‘శ్రీనికి అవసరమున్నాదానికంటే ఎక్కువ మద్దతు లభించింది. కాబట్టి ఆ కారణంగా శ్రీధర్‌ను జీఎం చేశారనడంలో వాస్తవం లేదు’ అని ఆయన అన్నారు. ఎంవీ శ్రీధర్ ముంబై నుంచి క్రికెట్ వ్యవహారాలు పర్యవేక్షించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీఎం (గేమ్ డెవలప్మెంట్) పదవిలో ఉన్న రత్నాకర్ షెట్టి అధికారాల్లో కోత పడే అవకాశం ఉంది.
అర్థం లేని విమర్శ
‘అర్హత లేని, క్రికెట్ తెలీని వారికి పెద్ద పదవి ఇస్తే దానిని ప్రశ్నించవచ్చు. కానీ నాపై విమర్శల్లో అర్థం లేదు. బోర్డులో వేర్వేరు పదవులు కేటాయించినపుడు కొంత మందికి నిరాశ తప్పదు. కానీ ఎవరో ఒకరు బాధ్యతలు నిర్వర్తించాలి కదా. ఏదైనా ముందుగా ఎలా ప్రకటిస్తారు. ఏజీఎంలోనే స్వయంగా శ్రీనివాసన్ నా పేరు చదివి వినిపించాక ఇంక విమర్శలు ఎందుకు.’
- ‘సాక్షి’తోఎంవీ శ్రీధర్