ఎర్రబుగ్గలు ఔట్.. కొత్త సీఎం డేరింగ్ నిర్ణయం!
చండీగఢ్: వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత వాహనాలపై ఎర్రబుగ్గలను ఉంచే సంస్కృతికి ఆయన చరమగీతం పాడారు. అంతేకాకుండా రెండేళ్లపాటు మంత్రులు, ఎమ్మెల్యేల విదేశీ ప్రయాణాలకు చెక్ పెట్టారు. ప్రభుత్వ ఖర్చుతో విందులు, వినోదాలు నిర్వహించడాన్ని నిషేధించారు. రాష్ట్ర ఖజానాపై దుబారా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు సీఎం అమరీందర్ సింగ్ తన తొలి కేబినెట్ సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దీంతో ఇక ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల వాహనాలపై మాత్రమే ఎర్రబుగ్గలు దర్శనమివ్వనున్నాయి. వీఐపీ సంస్కృతికి చమరగీతం పాడేందుకే ప్రభుత్వ వాహనాలన్నింటికీ ఎర్రబుగ్గల వినియోగాన్ని తొలగించినట్టు అధికారులు తెలిపారు. ఇతర రంగు బుగ్గలను వినియోగాన్ని కూడా పూర్తిగా ఎత్తివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు.