తోడేస్తున్నారు..
సాక్షి, భీమదేవరపల్లి(హుస్నాబాద్): జిల్లాకు సాగు నీటి గండం వచ్చింది. అవసరానికి మించి నీటిని తోడేస్తుండడంతోనే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో రావాల్సిన సాగు నీటి కొరత ఫిబ్రవరి చివరి నుంచే మొదలైంది. ఇప్పటికే వ్యవసాయ, బోరుబావుల్లో గణనీయంగా నీటి మట్టం తగ్గిపోయింది. ఏడు మండలాల్లో బోరుబావుల తవ్వకాలతోపాటు అత్యధికంగా నీటిని వినియోగిస్తున్నట్లు భూగర్భజల శాఖ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోవు రోజుల్లో పరిస్థితి మరింత జఠిలంగా అవుతుందని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 11 మండలాలు ఉండగా.. వీటి పరిధిలో 28,000 వ్యవసాయ బోరుబావులు, 32,000 వ్యవసాయ బావులున్నాయి. సాధారణ సాగు విస్తీర్ణం 24,768 హెక్టార్లు ఉండగా యాసంగిలో 23,728 హెక్టర్లలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు.
ఇందులో వరి 12,605 హెక్టార్లు, మొక్కజొన్న 9986 హెక్టార్లు, వేరుశనగ 553 హెక్టార్లరు. రైతులు ప్రధానంగా యాసంగిలో వరి, మొక్కజొన్న తదితర పంటలను సాగు చేస్తున్నారు. నిరంతర ఉచిత విద్యుత్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి సాగు నీటి వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది. దీనికి తోడు వర్షం నీటిని నిల్వ ఉంచకపోవడంతో కొరత ఏర్పడుతోంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది నెల రోజుల మందుగానే సాగు నీటి సమస్య మొదలైంది. యాసంగిలో వేసిన పంటను కాపాడుకోవడానికి కొత్తగా బోర్లు వేయించడంతోపాటు వ్యవసాయ బావులు తవ్విస్తున్నారు. పలు గ్రామాల్లో 600 ఫీట్ల వరకు బోరు వేసినా నీటి జాడ కనిపించడంలేదు. దీనిని బట్టి పరిస్థితి నీటి వినియోగం ఎమేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భీమదేవరపల్లి మండలంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి.
అత్యధికంగా నీటి వినియోగం చేసే గ్రామాలు
జిల్లాలో అత్యధికంగా సాగు నీటిని వినియోగి స్తున్న గ్రామాలను అధికారులు గుర్తించారు. అందులో భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగపూర్, భీమదేవరపల్లి, కొప్పుర్, కొత్తకొండ, మల్లారం, మాణిక్యాపూర్, ముల్కనూర్, ముస్తఫా పూర్, ముత్తారం, ధర్మసాగర్ మండలంలో జానకిపురం, మల్లక్కపల్లి, నారాయణగిరి, ఎల్కతుర్తి మండలంలో బావుపేట, దండెపల్లి, జీల్గుల, పెంచికల్‌పేట, తిమ్మాపూర్, వల్భాపూర్, హసన్‌పర్తి మండలంలో దేవన్నపేట, జయగిరి, లక్నవ రం, పెంబర్తి, ఐనవోలు మండలంలో గర్మిల్లపల్లి, ఐనవోలు, పంతని, పున్నేల, సింగారం, కమలా పూర్ మండలంలో భీంపల్లి, దేశరాజుపల్లి, గూనిపర్తి, ఖాజిపేట మండలంలో మడికొండ, తరాలపల్లి, ఖిలా వరంగల్ మండలంలో గాదేపల్లి, స్తంభంపల్లి, వసంతాపూర్, వేలేరు మండలం లో మల్లికుదుర్ల, వేలేరు ఉన్నాయి.
ఫిబ్రవరిలోనే తగ్గిన నీటి మట్టం
జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో భూగర్భజల నీటి మట్టం 8.33 మీటర్లు ఉండగా ఈ ఏడాది 9.52 మీటర్లకు చేరింది. గతేడాదితో పోల్చుకుంటే 1.19 మీటర్ల లోతుకు పడిపోయింది. ఇప్పటికే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తుండగా ఇక మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత ఉగ్రరూపం దాల్చనున్నాయి. దీంతో సాగు నీరు విషయం పక్కనబెటితే తాగు నీటికి సైతం తీవ్ర ఇబ్బందులు తప్పెలా లేవు.
పైలెట్ ప్రాజెక్టుగా భీమదేవరపల్లి
భూగర్జ జలాలను పెంపొందిచడంలో భాగంగా భీమదేవరపల్లి మండలాన్ని పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ఇందులో కొప్పుర్, గట్లనర్సింగపూర్, కొత్తకొండ, ముల్కనూర్, ముస్తఫాపూర్ గ్రామాలను ఎంపిక చేశారు. ఆయా గ్రామాల్లో చెక్ డ్యాంలు, చెరువుల్లో కృత్రిమ ఇంకుడు బోరుబావులను నిర్మించనున్నారు. 150 ఫీట్ల వరకు బోరుబావులను తవ్వనున్నారు. దీంతో భూగర్భ జలాలు పెరిగి ఖరీఫ్‌లో సాగు నీరు అధికం కావడానికి ఈ కృత్రిమ ఇంకుడు బోరుబావులు ఉపయోగపడునున్నాయి. ఒక్కో కృత్రిమ ఇంకుడు బోరుబావి నిర్మాణానికి ప్రభుత్వం రూ.లక్ష నుంచి రూ.1.50లక్షల వరకు వెచ్చించనున్నారు. ఆయా గ్రామాల్లో రైతులతో సభలు నిర్వహించి ఎక్కడ కృత్రిమ ఇంకుడు బోరుబావుల తవ్వకం చేపట్టాలనే అంశంపై తీర్మానాలు చేయనున్నారు. ఈ మేరకు ఇటీవల కొత్తకొండలో సమావేశం నిర్వహించారు.
నూతన బోర్లు, బావులకు చెక్..
భూగర్జ జలాలు తగ్గిపోతుండడంతో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలో 37 గ్రామాలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ యా గ్రామాల్లో నూతనంగా బోరులు వేయొద్దని, బావుల తవ్వకం చేపట్టవద్దని హెచ్చరిస్తున్నారు. ఒక వేళ వేసినట్లైతే కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు సైతం విధించనున్నారు.