అమ్మ కోసం యజ్ఞం చేస్తే.. తేనెటీగలు కుట్టాయి!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం బాగుపడాలని రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా పూజలు, యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారు. అలాగే వెల్లూరు జిల్లాలో కూడా ఒక మహాయజ్ఞం చేపడుతున్నారు. అయితే పరిసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా అమ్మ ధ్యాసలోనే మునిగిపోయిన మహాభక్తులు.. అక్కడున్న తేనెటీగలను చూసుకోలేదు. వీళ్లు చేస్తున్న యజ్ఞంతో తమకు ఇబ్బంది అనిపించిందో ఏమో గానీ.. అంబూరు ఎమ్మెల్యే ఆర్. బాలసుబ్రమణితో సహా పదిమంది అన్నాడీఎంకే నేతలను అవి కుట్టికుట్టి వదిలిపెట్టాయి. వడచేరి శక్తి మరియమ్మన్ కోయిల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ యజ్ఞంలో బాలసుబ్రమణితో పాటు గుడయతం ఎమ్మెల్యే జయంతి కూడా పాల్గొన్నారు.
ఆలయ ప్రాంగణంలోని ఒక రావిచెట్టు కింద ఈ యజ్ఞం చేశారు. ఆ చెట్టు కొమ్మల్లోనే ఓ పెద్ద తేనెపట్టు ఉంది. దాన్ని వాళ్లు అసలు చూసుకోలేదు. చెట్టుకింద చేస్తున్న యజ్ఞం కారణంగా వచ్చిన పొగతో ఆ తేనెటీగలకు ఎక్కడలేని కోపం వచ్చింది. అంతే, కింద ఉన్నవాళ్లు ఎవరన్న విషయం పట్టించుకోకుండా.. వారందరినీ కుట్టిపెట్టాయి. గుడియట్టం ఎమ్మెల్యే సమయానికి దగ్గర్లో ఉన్న ఓ కారు చూసుకుని అందులో దూరి తాళం వేసుకున్నారు. అయితే ఆమె భర్త పద్మనాభన్, ఎమ్మెల్యే బాలసుబ్రమణి, మరో 8 మంది మాత్రం తేనెటీగల బారిన పడ్డారు. ఎమ్మెల్యే బాలసుబ్రమణి కూడా కారులోకి దూరినా.. అవి కూడా కారులోకి వెళ్లి మరీ ఆయన్ను కుట్టాయి. ఆయనను వెంటనే అంబూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అక్కడ తక్షణ చికిత్సలు అందించారు. ఇతరులను అంబూరు ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు.