దిగువ ఆయకట్టుకు చుక్కనీరిచ్చేది లేదు
- మీ వాటా ఉన్నా ఇవ్వలేం
- తెగేసి చెప్పిన టీబీ బోర్డు అధికారులు
- కనీసం టీఎంసీ నీటిని ఇవ్వాలని కోరిన ఇంజినీర్లు
- 27 వేల ఎకరాలకు సాగునీటి ముప్పు
- సుమారు రూ. 200 కోట్ల పంట నష్టపోయే పరిస్థతి
కర్నూలు సిటీ:
తుంగభద్ర జలాశయం నుంచి దిగువ కాలువ ఆయకట్టుకు ఇకపై చుక్క నీటిని కూడా ఇచ్చేది లేదని బోర్డు అధికారులు జల వనరుల శాఖ ఇంజినీర్లకు తెగేసి చెప్పేశారు. గురువారం జరిగిన టీబీ బోర్డు సమావేశానికి ఎస్ఈ చంద్రశేఖర్‌రావు, మునిరాబాద్ ఎస్ఈ, బోర్డు సెక్రటరీ, ఎస్ఈ హాజరయ్యారు. డ్యాంలో నీటి నిల్వ తక్కువగా ఉందని, భవిష్యత్ తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇకపై ఆయకట్టుకు నీరు ఇవ్వలేమని తెల్చేశారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బోర్డు సమావేశంలో 151 టీఎంసీలకు అంచనా వేయగా, నీటి లభ్యత ఆశించిన మేరకు రాలేదని 70 టీఎంసీలకు తగ్గించారు. ఈ మేరకు వచ్చిన వాటా నీరు కూడా సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. దిగువ కాలువకు కింద ఖరీఫ్‌లో సాగు చేసిన ఆయకట్టు ఇంకా 27 వేల ఎకరాలు సాగులో ఉందని, ఇంకా డ్యాంలో 2.75 టీఎంసీల నీరు ఉందని, ఇందులో టీఎంసీ నీరు ఇవ్వాలని ఎస్ఈ ..బోర్డు సెక్రటరీని కోరారు. తాగునీటి కోసమైతే ఫిబ్రవరి నుంచి ఇస్తామనడంతో అప్పుడు 1.75 టీఎంసీల నీరు సరిపోతుందని, స్టాండింగ్ క్రాప్స్‌కు కనీసం ఒక తడికైనా ప్రస్తుతం ఇవ్వాలని, లేకుంటే రైతులు నష్టపోతారని ఎస్ఈ ప్రాధేయపడినా బోర్డు అధికారులు స్పందించలేదు. దీంతో సాగులోని ఆయకట్టు సుమారు రూ.200 కోట్లదాకా ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉన్నట్లు ఇంజినీర్లు చెబుతున్నారు.