Bengal students
-
Tuktuki Das: ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ
ఎం.ఏ ఇంగ్లిష్ చదివిన అమ్మాయిలు టీచర్ అవుతారు. లెక్చరర్లు కావాలని ప్రయత్నిస్తారు. ప్రయివేటు ఉద్యోగాలు అన్వేషిస్తారు. కాని టుక్టుకీ దాస్ అలా కాదు. ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ పేరుతో టీకొట్టు తెరిచింది. నేను ఉపాధి వెతుక్కోవడం కాదు. వ్యాపార రంగంలో ఎదిగి నలుగురికీ ఉపాధి ఇస్తాను అంటోంది. కుతూహలం రేపుతున్న ఈ పోస్ట్‌గ్రాడ్యుయేట్ కథ ఏంటి? ‘ఐయామ్ హ్యాపిలీ సేయింగ్ దట్ ఐయామ్ బిజీ’ అంటుంది 26 ఏళ్ల టుక్టుకీదాస్. ఎంత బిజీ ఆ అమ్మాయి? ఉదయం ఐదు గంటలకు లేచి సైకిల్ మీద తన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న రైల్వేస్టేషన్‌కు వెళుతుంది. అప్పటికే ఆమె టీ కోసం కస్టమర్లు వెయిట్ చేస్తుంటారు. అప్పటి నుంచి రాత్రి 10 వరకూ తన టీకొట్టులోనే ఉంటుంది. వచ్చిన వారందరికీ టీ ఇస్తుంది. వారితో కబుర్లు చెబుతుంది. టీ అన్నీ చోట్లా ఉంటుంది. మరి ఎందుకు ఆమె దగ్గరికే వచ్చి కొంటారు అనంటే ఆమె టీకొట్టు పేరు ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’. ఎం.ఏ ఇంగ్లిష్ చేసిన ఒక అమ్మాయి తయారు చేసి అమ్ముతున్న టీ కనుక ఇప్పుడు ఈ క్రేజ్. బెంగాల్ అమ్మాయి టుక్టుకీదాస్ది పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణ జిల్లాలోని హాబ్రా. ముగ్గురు పిల్లల్లో తను పెద్దది. తండ్రి వ్యాన్ డ్రైవర్. తల్లికి చిన్న కిరాణాషాపు ఉంది. ‘అందరు ఆడపిల్లల్లాగే నేను కూడా రెండు విషయాలు వింటూ పెరిగి పెద్దదాన్నయ్యా. ఒకటి:గవర్నమెంట్ ఉద్యోగం, రెండు: పెళ్లి’ అంటుంది టుక్టుకీ దాస్. 2020లో రవీంద్రభారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లిష్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశాక కొన్నాళ్లు ట్యూషన్ చెప్పింది. ‘నాకు టీచింగ్ అంటే ఇష్టమే కాని అది ఒకేచోట ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది. నేను ఇంకా ఏదో సాధించాలి. నా కాళ్ల మీద నేను నిలబడాలి’ అంటుంది టుక్టుకీ దాస్. ఎం.బి.ఏ చాయ్‌వాలా స్ఫూర్తి ఎం.బి.ఏ చాయ్‌వాలా పేరుతో ప్రఫుల్ బిల్లోర్ అనే ఎంబిఏ కేండిడేట్ తెరిచిన వరుస టీకొట్లు హిట్ అయ్యాయి. అలాగే ఆస్ట్రేలియాలో ఉప్మా విర్ది అనే ఆమె చాయ్వాలీ పేరుతో టీ అమ్ముతూ ఫేమస్ అయ్యింది. ‘నేను కూడా వారిలాగే చాయ్ దుకాణం తెరుద్దామని అనుకున్నాను. నేను ఎం.ఏ ఇంగ్లిష్ చదివాను కనుక ఎం.ఏ ఇంగ్లిష్ చాయ్వాలీ పేరుతో టీకొట్టు తెరిచాను. దీనికి ముందు ఎక్కడ టీకొట్టు పెట్టాలా అని ఆలోచిస్తే కాలేజీల వద్ద, హాస్పిటల్స్ వల్ల లేదా రైల్వే స్టేషన్లో అనే ఆప్షన్స్ కనిపించాయి. కాలేజీలు కరోనా వల్ల సరిగ్గా నడవడం లేదు. హాస్పిటల్స్ దగ్గర మనుషులు తాగడం లేదు. అందుకని రైల్వేస్టేషన్‌ను ఎంచుకున్నాను’ అంటుంది టుక్టుకీ దాస్. ఆ షాపు తెరవడానికి గత సంవత్సరం ట్యూషన్ చెప్పి దాచుకున్న 10 వేల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. ‘అమ్మా నాన్నలకు నేను చాయ్ దుకాణం పెడతానని చెప్తే వద్దనలేదు కాని ఆశ్చర్యపోయారు. పైగా రైల్వేస్టేషన్ అనేసరికి ఎలా ఉంటుందో అనుకున్నారు. కాని వారి మద్దతుతో ముందుకే వెళ్లాను’ అంటుందామె. మొదటిరోజే ఉచితంగా నవంబర్ 1, 2021న హాబ్రా రైల్వేస్టేషన్లో కొంతమంది మిత్రుల మధ్య, మైక్‌లో వినిపిస్తున్న అనౌన్స్మెంట్ల మధ్య ‘ఎంఏ ఇంగ్లిష్ చాయ్వాలీ’ దుకాణాన్ని తెరిచింది టుక్టుకీదాస్. దానికి ముందు నుంచే ఆమె బ్లాగింగ్ కూడా చేస్తుండటం వల్ల తన రోజువారీ అనుభవాలను కూడా వీడియో తీసి బ్లాగ్‌లో ఉంచడం మొదలెట్టింది. ఈ పేరు కొత్తగా ఉండటం, ఫేస్బుక్లో ఆమె రోజూ వీడియోలు పెడుతుండటంతో వెంటనే గుర్తింపు వచ్చేసింది. జనం కుతూహలంతో ఆమె షాపుకు వచ్చి టీ తాగడం మొదలెట్టారు. ‘అక్కా.. టీ ఇవ్వు. అలాగే ఒక సెల్ఫీ కూడా’ అని కాలేజీ పిల్లలు అడగడం మొదలైంది. మొదటి రోజు రెండు గంటల పాటు కస్టమర్లను ఆకర్షించడానికి ఉచితంగా టీ ఇచ్చింది టుక్టుకీ దాస్. ఆ తర్వాత డబ్బులు అవే గల్లాపెట్టెలో పడటం మొదలయ్యాయి. ఏదీ తక్కువ కాదు రైల్వే స్టేషన్లో టీ అమ్మే అమ్మాయిని చూసి అక్కడి పోర్టర్లే మొదట చులకనగా చూశారు టుక్టుకీ దాస్‌ని. ‘ఏ పనైనా గౌరవప్రదమైనదే అని మన దేశంలో గ్రహించరు. అమ్మాయిలు శ్రమ చేసి తమ కాళ్ల మీద తాము నిలబడటాన్ని చూసి హర్షించాలి’ అంటుంది టుక్టుకీ దాస్. అయితే ఇప్పుడు అందరూ ఆమెను ప్రశంసాపూర్వకంగా చూస్తున్నారు. సాయం వద్దు టుక్టుకీ దాస్ చాయ్ దుకాణం పాపులర్ అయ్యేసరికి కొంతమంది పెద్దలు వచ్చి సాయం చేస్తామన్నారు. ‘నేను సున్నితంగా వారించాను. నేను పైకి వస్తే నా వల్లే రావాలి తప్ప వేరొకరి సాయంతో కాదు. నేను ఇప్పుడు నా చాయ్ దుకాణంతో సంతోషంగా ఉన్నాను. ఇంకా నేను ఈ బ్రాండ్‌తో కోల్కటాలో దుకాణాలు తెరవాలి. కాని ఈ దుకాణం మాత్రం మూసేయను. ఇది మొదటిది. నా సెంటిమెంట్‘ అంటుంది టుక్టుకీ దాస్. టుక్టుకీ దాస్ రోజూ చాలా బిజీగా ఉంటోంది. చాలామంది ఫుడ్బ్లాగర్స్ ఆమెతో వీడియోలు చేస్తున్నారు. ఒక అమ్మాయి ఆత్మవిశ్వాసంతో టీ అమ్ముతూ ఉండటం సంతోషంగా ఉండటం అందరికీ ఎందుకు నచ్చదు. భిన్నంగా ఆలోచిస్తే మామూలు టీ కూడా ఇలా బ్రాండ్ అయి కూచుంటుంది. -
బీఈడీ పేరుతో బురిడీ !
- పశ్చిమ బెంగాల్ విద్యార్థుల నిరీక్షణ - పదిరోజులుగా హాల్ టికెట్ల కోసం ఎదురుచూపులు - మోసపోయామని తెలుసుకుని లబోదిబోమంటున్న విద్యార్థులు వినుకొండ రూరల్: ఇతర రాష్ట్రాల నుంచి పట్టణంలో బీఈడీ చదువుతన్న విద్యార్థులు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పట్టణంలోని సెవెన్‌హిల్స్ బీఈడీ కళాశాల వద్ద పశ్చిమ బెంగాల్ విద్యార్థులు దాదాపు 150 మంది తమకు హాల్ టికెట్లు అందలేదని సోమవారం అర్ధరాత్రి కాలేజీ యాజమాన్యంతో ఘర్షణకు దిగారు. కాలేజీ యాజమాన్యం తమకు సంబంధం లేదని చెప్పడంతో తమను బురిడీ కొట్టించిన ఏజెంట్ రాజీవ్ గైన్‌ను నిలదీశారు. పరీక్షలు రాసేందుకు వారం కిందట పట్టణానికి చేరుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు కళాశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి మోసపోయిన విషయం గ్రహించారు. తమను నమ్మించి ఇక్కడ వరకూ తీసుకువచ్చిన ఏజెంట్లు రాజీవ్ గైన్, దేబాషిస్ బేరా, హఫీజిత్ రెహమాన్, సుబ్జిత్ ఛ టర్జీల్లో రాజీవ్ గైన్‌ను పట్టుకుని వినుకొండకు తీసుకొచ్చి ప్రశ్నించారు. కాలేజీ వారు మోసం చేస్తున్నారని, మీ డబ్బు తిరిగి ఇచ్చేస్తామని నచ్చజెప్పిన ఏజెంట్ వారితో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. విలువైన ఏడాది వృథా అయిందన్న ఆవేదనతో కొంద రు విద్యార్థులు కళాశాల ముందే తిష్ట వేశారు. వారికి బాషా సమస్య ఉండటంతో వారి గోడు వినేనాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా ఆర్జేడీ స్థాయి లో విచారణ నిర్వహిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని పలువురు కోరుతున్నారు. అన్నింటిదీ అదేదారి..! రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కౌన్సెలింగ్ ద్వారా ప్రతి కళాశాల 75 శాతం సీట్లు, యాజమాన్యం 25 శాతం సీట్లు భర్తీ చేస్తారు. మన రాష్ట్రంలో ప్రస్తుతం డీఎడ్‌కు ఉన్న డిమాండ్ బీఈడీకి లేకపోవటంతో దాదాపు 80 శాతం సీట్లు ఖాళీగానే ఉంటున్నాయి. దీంతో ఇతర రాష్ట్రాల్లోని విద్యార్థుల కోసం ఏజెంట్ల ద్వారా వేటసాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో బీఈడీకి డిమాండ్ ఉన్నా.. అందుకు తగ్గ కళాశాలలు అక్కడ లేకపోవడం ఇక్కడి కళాశాలలకు వరమైంది. ఏజెంట్ల ద్వారా అక్కడి విద్యార్థులకు వలవేసి ఏడాదికి కేవలం రూ.70 వేలు చెల్లిస్తే చాలు.. కాలేజీకి రానవసరం లేదు.. పరీక్షల రోజు వచ్చి హాల్ టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరుకావొచ్చని ప్రచారం నిర్వహించి విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి కళాశాలలకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు వలసలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రంలో ఉన్న కళాశాలలు మాస్ కాపీయింగ్ చేయిస్తూ వారి నుంచి భారీ మొత్తంలోనే గుంజుకుంటున్నాయి. సీట్ల పరిమితికి మూడు నాలుగు రెట్ల మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులను చేర్చుకుని, కళాశా లల వారే సొంతంగా బోర్డ్ పరీక్షలు నిర్వహించి మోసగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అభ్యర్థులను ఏజెంట్లే మోసం చేశారు.. దళారి ఏడుకొండలు, కరస్పాండెంట్, సెవెన్ హిల్స్ బీఈడీ కళాశాల ఈ విషయమై కళాశాల కరెస్పాండెంట్ దళారి ఏడుకొండలును వివరణ కోరగా అడ్మిషన్లు పొందిన విద్యార్థుందరికీ హాల్ టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. తమ కళాశాల విద్యార్థుల పరిమితి 100 అని, కానీ ఇప్పుడు పశ్చిమ బంగాల్ నుంచి ఒక్కసారిగా 150 మందికి పైగా వచ్చి హాల్ టికెట్లు ఇవ్వమని అడుగుతుంటే తమకే ఆశ్చర్యంగా ఉందని చెప్పారు. ఇదంతా చూస్తుంటే ఏజెంట్లు అభ్యర్థులను మోసం చేసినట్లు తెలుస్తోందన్నారు. ఏజెంట్లతో మాట్లాడి అభ్యర్థుల నగదు వెనక్కి ఇవ్వాలని తామూ చెప్పినట్లు వివరించారు.