కర్నూలులో దళిత సంఘాల రాస్తారోకో
కర్నూలు: బెస్ట్ అవైలబుల్ స్కీం(బీఏఎస్) కింద విద్యార్థుల ఎంపికలో జడ్పీ చైర్మన్ జోక్యాన్ని నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో కర్నూలులో భారీ రాస్తారోకో నిర్వహించారు. బీఏఎస్ పథకం కింద విద్యార్థుల ఎంపిక కార్యక్రమం బుధవారం కర్నూలులో ప్రారంభమైంది. అయితే, అర్హులను ఎంపిక చేయకుండా అనర్హులకు జాబితాలో స్థానం కల్పించారంటూ దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో అంబేద్కర్ భవన్ ఎదుట రాజ్‌విహార్ సెంటర్లో రోడ్డుపై బైఠాయించి, నిరసన తెలిపారు. జడ్పీ చైర్మన్ ఎం.రాజశేఖర్ జోక్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది.