కేజీఎఫ్ ఆస్పత్రికి అనారోగ్యం..!
కేజీఎఫ్ : పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కనీస మౌలిక సదుపాయాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పూర్తి నిర్లక్ష్యమే ఇందుకు కా రణమని స్థానికులు తెలిపారు. వెనుకబడిన ప్రాంతమైన కేజీఎఫ్ ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుగా ఉంది. నిత్యం అధిక సంఖ్యలో కూలీలు ఇక్కడికి వస్తుం టారు. పట్టణంలో బీజీఎంఎల్ ఆస్పత్రి మూతపడిన తరువాత పట్టణ పేదలు పూర్తిగా ప్రభుత్వ ఆస్పత్రి పైనే ఆధార పడ్డారు.
గత కొద్దిరోజుల క్రితం ఆస్పత్రిని సందర్శించిన జిల్లా ఇన్చార్జి మంత్రి యూటి.ఖాదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆయన హామీ నెరవేరలేదు. ప్రభుత్వ ఆస్పత్రికి నిత్యం 500 మంది దాకా బయటి నుంచి రో గులు వస్తుంటారు. ఆస్పత్రిలో కనీసం తాగునీటి సౌల భ్యం కూడా లేక పోవడం వల్ల రోగులు బయటనుంచి తాగునీటిని తెచ్చుకోవాల్సివస్తోంది. శౌచాలయాలు సక్రమంగా లేక పోవడం వల్ల మహిళా రోగుల పాట్లు వర్ణనాతీతం. ఆస్పత్రిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ప్రయోజనం కనిపించ లేదు.
బ్లడ్ బ్యాంక్ వద్ద విద్యుత్ దీపాలు లేకపోవడం వల్ల రాత్రి పూట అనైతిక కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నాయి. ఆస్పత్రిలో సరైన చికిత్స లేక పోవడం వల్ల రోగులు గత్యంతరం లేక ప్రెవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. రోగులు లేక వార్డులు ఖాళీగా పడి ఉన్నాయి. వంద సంవత్సరాల చరిత్ర ఉండి మైసూరు మహారాజు నెలకొల్పిన ఈ ఆస్పత్రి దుస్థితిలో ఉండి దీనిని అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.