ముంబై స్కూళ్లలో భగవద్గీత బోధన
ముంబై: ముంబై మున్సిపల్ స్కూళ్లలో ఇకపై భగవద్గీత బోధించనున్నారు. విద్యార్థుల్లో ఏకాగ్రత పెంచడానికి, వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి, వారిని ఆధ్యాత్మికతవైపు నడిపించడానికి భగవద్గీత ఎంతో ఉపకరిస్తుందని గ్రేటర్ ముంబై మున్సిపల్ అధికారి ఒకరు పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా పిల్లల్లో విఙ్నానం అభివృద్ధి చెందుతుందని, తద్వారా వారి నిర్ణయాత్మక శక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు. అంతర్జాతీయ కృష్ణ సొసైటీ (ఇస్కాన్) నిర్వహించిన 'గీతా ఛాంపియన్స్ లీగ్' కార్యక్రమంలో గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మన పిల్లలే మన భవిష్యత్తు అని ఆయన తెలిపారు. మనం వారిలోని నైపుణ్యాలను పెంపొందించాలి. టీవీ, సినిమా, ఇంటర్నెట్ లు పిల్లలను హింస, అపరిశుభ్రతవైపు నడిపిస్తాయి. అంతేకాకుండా వాటివల్ల పిల్లల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయని ఇస్కాన్‌కు చెందిన రాధాగోపీనాథ్ దేవాలయ ఆధ్యాత్మిక గురువు రాధానాథ్ స్వామి తెలిపారు.