రెండో త్రైమాసికం బాగుంటుంది
ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా
సింగపూర్: ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో భారత్ వృద్ధి మెరుగ్గా ఉండగలదని జపాన్‌కి చెందిన ఆర్థిక సేవల సంస్థ నొమురా అంచనా వేసింది. క్యూ1లో వృద్ధి 6.1 శాతంగా ఉంటే .. క్యూ2లో 6.5–7% శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. వస్తు, సేవల పన్నుల విధానం (జీఎస్టీ)తో కొంత అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నా ఆ ప్రభావం స్వల్పకాలికంగానే ఉండి రెండో త్రైమాసికంలో మెరుగైన వృద్ధికి ఉపయోగపడగలదని తెలిపింది. ‘కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు మొదలైన వాటి విక్రయాలు.. బొగ్గు, విద్యుదుత్పత్తి మొదలైనవి పెరుగుతున్న నేపథ్యంలో తొలి త్రైమాసికం కన్నా జూన్ క్వార్టర్లో వృద్ధి సగటున కొంత మెరుగ్గా ఉండగలదు‘ అని నొమురా చీఫ్ ఎకానమిస్ట్ సోనల్ వర్మ పేర్కొన్నారు.
జీఎస్టీ అమల్లోకి వచ్చాక ధరలు తగ్గుముఖం పట్టొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్లు ఆమె వివరించారు. అయితే, జీఎస్టీ విధానానికి మారే క్రమంలో టోకు వర్తకులు .. నిల్వలు తక్కువ స్థాయిల్లో ఉంచవచ్చని పేర్కొన్నారు. మొత్తం మీద చూస్తే.. భారత్ వృద్ధి ఈ ఏడాది 7%గాను, వచ్చే ఏడాది 7.8%గాను ఉండొచ్చని తెలిపారు. 2016–17లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మూడేళ్ల కనిష్టమైన 7.1%కి పడిపోయిన నేపథ్యంలో తాజా అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.