భవానీమాత ఆలయంలో చోరీ
- పురాతన పంచలోహ విగ్రహం, ఉత్సవ ప్రతిమ అపహరణ
- హుండీ పగులగొట్టి డబ్బులూ..
- డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంతో వివరాల సేకరణ
- పరిశీలించిన ఏఎస్పీ చందనదీప్తి
- పాత తాండూరులో ఘటన
తాండూరు రూరల్: ఓ పురాతన అమ్మవారి పంచలోహ విగ్రహంతో పాటు ఉత్సవ విగ్రహం, అమ్మవారి తాళిబొట్టు, హుండీలోని డబ్బును గుర్తుతెలియని దుండగులు అపహరించుకుపోయారు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున తాండూరులో చోటుచేసుకుంది. పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఆలయ కమిటీ సభ్యుల కథనం ప్రకారం.. పాత తాండూరులో భవానీమాత ఆలయం ఉంది. దాదాపు 350 ఏళ్ల పురాతన పంచలోహ విగ్రహం, ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం 6.30 గంటల సమయంలో న్యాయవాది శ్రీనివాస్ అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. అప్పటికే ఆలయం ద్వారం తాళం విరిగిపోయి కనిపించింది. గుడిలో ఉన్న అమ్మవారి పంచలోహ విగ్రహం కనిపించలేదు. దీంతో న్యాయవాది ఆలయ కన్వీనర్ నారా మహిపాల్‌రెడ్డితో పాటు స్థానికులకు విషయం తెలిపాడు. పట్టణ సీఐ వెంకట్రామయ్య, ఎస్ఐలు నాగార్జున, ప్రకాష్‌గౌడ్,రవి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భవానీమాత పంచలోహ విగ్రహం, ఉత్సహ విగ్రహం, ఇత్తడి ప్రమిదలు, హారతి పళ్లెం చోరీ అయిందని గుర్తించారు.
దుండగులు ఆలయంలోని హుండీని పగులగొట్టి అందులో డబ్బులు తీసుకొని దానిని ఆలయం బయట పడేసి వెళ్లిపోయారు. తాను గురువారం రాత్రి 8 గంటల వరకు ఆలయంలోనే ఉండి తాళం వేసి వెళ్లిపోయానని పూజారి కిరణ్ సీఐకి చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం వికారాబాద్ నుంచి డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంలను రప్పించారు. పోలీసు జాగిలం ఆలయం నుంచి స్థానికంగా ఉన్న మాణిక్‌నగర్‌లోని ఇళ్ల వద్దకు వెళ్లి ఆగింది.
ఆలయం వద్ద పెద్దఎత్తున స్థానికులు గుమిగూడారు. ఉద్రిక్తత చోటుచేసుకునే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. అనంతరం తాండూరు ఏఎస్పీ చందనదీప్తి సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అంతర్రాష్ట్ర దొంగలముఠా అయి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో దుండగులను పట్టుకుంటామని, స్థానికులు కూడా సహకరించాలని ఆమె కోరారు. పోలీసులు ఆలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చోరీ ఘటనపై పట్టణవాసులు నిరసన వ్యక్తం చేశారు. ఆలయ కన్వీనర్ నారా మహిపాల్‌రెడ్డి ఫిర్యాదు మేర కు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.