ఆస్పత్రికి దిక్కెవ్వరు?
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, ఆస్పత్రి ఆర్ఎంఓ రావూఫ్‌లు సెలవు బాట పడుతున్నారు. నెలరోజుల సెలవు మంజూరు చేయాలని కోరుతూ సూపరింటెం డెంట్ భీంసింగ్ మంగళవారం కలెక్టర్, వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకో గా ఆర్ఎంఓ బుధవారం దరఖాస్తు సమర్పించనున్నారు. ఇటీవల ఆస్పత్రిని తనిఖీ చేసిన ఉన్నతాధికారి ఒకరు ఆస్పత్రిలో లోపాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో మనస్తాపం చెం దిన సూపరింటెండెంట్, ఆర్‌ఎంఓలు సెలవులో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
వైద్యసేవలపై ప్రభావం..
జిల్లా ఆస్పత్రిలో వైద్యాధికారులు లేకపోతే వైద్యసేవలు గాడితప్పే ప్రమాదం ఉంది. ఇటీవలి కాలంలో ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. రోగులకు సరైన వైద్య సేవలందించడంలో అధికారులు కీలకపాత్ర పోషిస్తారు. నిరంతరం సిబ్బందిని అప్రమత్తం చేస్తూ పనులు చేయించడం వీరి బాధ్యత. అయితే కీలక అధికారులు సెలవుపై వెళితే ఆస్పత్రిలో సిబ్బంది ఇష్టారాజ్యం నెలకొంటుందని, సేవలు గాడి తప్పుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కింది స్థాయి వైద్యులకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా ఫలితం ఉండదని పేర్కొంటున్నారు.
అవసరం నిమిత్తమే...
-భీంసింగ్, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రి
వ్యక్తిగత పనుల నిమిత్తం ఎప్పటినుంచో సెలవుకోసం ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు అత్యవసరమైంది. అందుకే సెలవుకోసం దరఖాస్తు చేసుకున్నాను.