‘భూదాన’ దడ
ఇబ్రహీంపట్నం రూరల్: నిరుపేదలకు భూమి ఇవ్వాలనే సంకల్పంతో ఆచార్య వినోభాబావే 1955లో దేశవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఎకరాలకు పైగా సేకరించారు. ఇప్పటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భూమిని సేకరించి 1965లో భూదానయజ్ఞ బోర్డును స్థాపించారు. 1951-65 కాలంలో నగరశివారు ప్రాంతాలైన ఇబ్రహీంపట్నం, కుంట్లూరు, కూకట్పల్లి, తారామతిపేట, బాటసింగారం, మెదక్‌జిల్లా జహీరాబాద్, సుల్తాన్పూర్, నల్లగొండజిల్లా గొల్లగూడ ప్రాంతాల్లో వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారు.
ఇందులో భాగంగా వినోభాబావే ఇబ్రహీంపట్నం ప్రాంతంలో పర్యటించి సుమారు 5వేల ఎకరాలను సేకరించి నిరుపేదలకు పంపిణీ చేశారు. యాచారం, హయత్‌నగర్, కందుకూరు, మేడ్చల్, మహేశ్వరం మండలాల్లో 1,683 మంది భూదాతల నుంచి 21,931 ఎకరాలు సేకరించారు. ఇందులో దాదాపు 13వేల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారు.
జిల్లాలో భూదానం ఇలా..
హయత్‌నగర్ మండలం కుంట్లూర్ 278/1 సర్వేనంబర్‌లో పది ఎకరాల భూమిని రాంరెడ్డి అనే రైతు భూదాన బోర్డుకు దానం చేశారు. సుమారు 285 మంది నిరుపేదలకు ఈ భూమిలో ప్లాట్లు కేటాయించారు.
బాటసింగారంలో మహ్మద్ జహంగీర్ ఘోరీ అనే వ్యక్తి సర్వేనంబర్ 319లో 16 ఎకరాల 30 గుంటల భూమిని దానంగా ఇచ్చారు. ఈ భూమిలో 470 ప్లాట్లు చేసి పేదలకు కేటాయించారు.
తారామతిపేట 215, 216, 217, 235, 236, 209 సర్వేనంబర్లలోని 71 ఎకరాల భూములను శంకర్గంగయ్య దానం చేశారు. ఈ భూమిలో 1600 మందికి ఇళ్ల స్థలాలు కేటాయించారు.
కూకట్‌పల్లిలో శాపూరి చెన్నయ్ అనే వ్యక్తి సర్వేనంబర్ 353, 354లలో 24 ఎకరాల 26 గుంటల భూమిని దానం చేశారు. ఈ భూముల్ని 12 మంది రైతులకు సాగు నిమిత్తం కేటాయించారు. సదరు భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన 17 ఎకరాల భూమి కోర్టు కేసులో ఉంది. మిగిలిన ఏడు ఎకరాల్లో 300 మందికి ఇళ్ల పట్టాలిచ్చారు.
బోర్డుపై ఆరోపణలు
పేదల కోసమే భూ పంపిణీ అని చెప్పిన బోర్డు తమ ఆధీనంలో వున్న వేలాది ఎకరాల భూముల్ని అనేక సంస్థలకు అప్పనంగా కట్టబెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని భూములను ఇష్టారీతిలో విక్రయించారని గతంలో దుమారం లేచింది. ఇబ్రహీంపట్నంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌కు 670 ఎకరాలు, ఆక్టోపస్‌కు 570 ఎకరాలు, నేషనల్ పోలీస్ అకాడమీకి 400 ఎకరాలు, సీఆర్పీఎఫ్కు 400 ఎకరాల భూమిని కేటాయించారు. కందుకూరు, ఘట్కేసర్ మండలాల్లో సబ్స్టేషన్ల నిర్మాణం కోసం వందల ఎకరాల భూమిని కేటాయించారు. రంగాపూర్‌లో క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌కు 150 ఎకరాల భూములు కేటాయించారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సేకరించిన 1.95లక్షల ఎకరాల్లో ప్రస్తుతం సుమారు 350 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చెప్తున్నాయి.
కేటాయింపు ఇలా..: భూదాన్యాక్ట్-1965 ప్రకారం భూమిలేని, ఇంటి స్థలం లేని పేదలు దరఖాస్తు చేసుకుంటే అసైన్డ్ చట్టాన్ని అనుసరించి భూదాన భూముల్లో వారికి స్థలాల్ని కేటాయిస్తారు. భూమిని పొందిన మూడేళ్లలోపు ఆ స్థలంలో వ్యవసాయం చేయాలి. సుమారు పదేళ్ల వరకూ లబ్ధిదారులు బోర్డుద్వారా పొందిన భూమిని విక్రయించరాదు. రైతుల కోసం ఇచ్చిన భూములపై కన్నేసిన బడా వ్యాపార వేత్తలు వారిని బెదిరించి కారుచౌకగా కొనుగోలు చేసినప్పటికీ భూదాన బోర్డు ఈ విషయంలో చొరవ తీసుకోలేదనే విమర్శలున్నాయి.
అతి ఖరీదైన భూములున్న ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్‌నగర్ మండలాల్లో భూదాన భూముల్ని ఏపీఐఐసీకి అప్పగించి పారిశ్రామిక పక్షపాతిగా మారిందన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం భూదాన యజ్ఞబోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇటు పట్టాదారులతో పాటు కబ్జాదారుల్లో కలవరం మొదలైంది. బోర్డు రద్దుతో సంస్థలకు, పేదలకు ఇచ్చిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందేమోనన్న ఆందోళనలు పెరిగాయి.