నాయుడు ద్వయం రాక.. జెండాకు అవమానం
విశాఖపట్టణం: జాతీయ భావాన్ని, దేశభక్తిని పెంపొందించడంలో భాగంగా సదరన్ రీజియన్‌లోని అన్ని విమానాశ్రయాల్లో బుధవారం జాతీయ జెండాలు ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు విశాఖపట్నం విమానాశ్రయ ప్రాంగణంలోని గార్డెన్లో 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పున జాతీయ భారీ జెండాను ఏర్పాటుచేశారు. బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు బుధవారం నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల చేత ఆవిష్కరింపజేయాలని ఎయిర్ పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ శర్మ భావించారు. విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌ను ఒప్పించి సీఎం, కేంద్ర మంత్రి షెడ్యూల్ లో ఈ కార్యక్రమాన్ని కూడా పొందుపర్చారు. కానీ..
తొలుత విమానాశ్రయంలో దిగిన వెంకయ్యనాయుడు పాతటెర్మినల్ బిల్డింగ్ నుంచి వెలుపలికి వచ్చి.. బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులతో ఊరేగింపుగా నగరంలోకి వెళ్లిపోయారు. తర్వాత కొద్ది సేపటికే ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. కలెక్టర్ సహా ప్రజాప్రతినిధులతో కలిసి బ్రిక్స్ సదస్సు ప్రాంగణానికి వెళ్లిపోయారు. భారీ జాతీయ జెండాను ఆవిష్కరించకుండా సీఎం, కేంద్రమంత్రి వెళ్లిపోవడంతో ఎయిర్ పోర్టు డైరెక్టర్ శర్మ ఒకింత ఆందోళనకుగురయ్యారు. వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి విషయం గుర్తుచేయగా.. 'వారికి తీరిక లేద'న్న సమాధానం వచ్చింది.
దీంతో ఎం చెయ్యాలో పాలుపోని అధికారులు తర్జనభర్జనల అనంతరం కలెక్టర్‌తో చర్చించి మరో సారి జెండాను ఆవిష్కరింపజేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అప్పటికి వరకు జెండాను జాగ్రత్తగా దాచి ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఈలోగా వర్షం కురవడంతో జెండా తడిసిముద్దయింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత జెండా తీసేశారు. ఆవిష్కరణకు సిద్ధంగా ఉంచిన జెండాను ఎంగరేయకుండా తీసేయడం అవమానించడమేనని పలువురు పేర్కొన్నారు.