'బీజేపీ హయాంలోనే భారీ కుంభకోణం'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'ఫ్రీడమ్ 251' మొబైల్స్ వ్యాపారం మిలినియమ్ లోనే భారీ కుంభకోణమని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ ఆరోపించారు. న్యూఢిల్లీలో శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ మీడియాతో మాట్లాడారు. కేవలం రూ.251 కే స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం అనేది మిలినియంలో బీజేపీ పాలనలోనే బిగ్గెస్ట్ స్కామ్ అంటూ అధికార ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రింగింగ్ బెల్స్ కంపెనీ నుంచి కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన సొమ్మును భద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు.
తప్పుల తడకగా మారి ఇతర ముబైల్ కంపెనీలకు భారీగా నష్టం కలిగించిన 'ఫ్రీడమ్ 251' ముబైల్ ఫోన్స్ విషయంలో నిజనిజాలు ఏంటన్నది బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయాలని రాజ్యసభలో పేర్కొన్నారు. రింగింగ్ బెల్స్ కంపెనీ కేవలం బీజేపీ ప్రభుత్వం సహకారంతోనే కేవలం 251 రూపాయలకే లభ్యమయ్యే స్మార్ట్ ఫోన్స్ తయారుచేసుందుకు సిద్ధపడిందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. 'ఫ్రీడమ్ 251' వెబ్ సైట్లో ఆన్ లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారిలో కేవలం 25 లక్షల మందికే ఈ చౌక ఫోన్లను అందిస్తామని కంపెనీ అధ్యక్షుడు అశోక్ చద్ధా ప్రకటించిన విషయం తెలిసిందే.