అసలు అత్యాచారమే జరగలేదట!!
పశ్చిమబెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో 20 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేయించిన దారుణ సంఘటన గుర్తుంది కదూ. పశువుల్లా ప్రవర్తించిన దాదాపు 13 మంది తనపై లెక్కలేనన్ని సార్లు అత్యాచారం చేశారంటూ బాధితురాలు వాపోయింది. అయితే.. అసలు అక్కడ అత్యాచారం అనేదే జరగలేదట. ఆ విషయాన్ని స్వయంగా అక్కడి గ్రామపెద్దలు చెబుతున్నారు. కొన్ని తరాలుగా వస్తున్న తమ సంప్రదాయ న్యాయ వ్యవస్థను మీడియా అనవసరంగా తప్పుగా చిత్రీకరించిందని మండిపడ్డారు.
వివిధ జిల్లాలకు చెందిన దాదాపు 20 సంతల్ సంస్థలు కలిసి ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి. ఇవన్నీ కలిసి అసలు అత్యాచారం అన్నదే జరగలేదని తేల్చిచెప్పాయి. కొన్ని తరాలుగా వస్తున్న తమ న్యాయ వ్యవస్థకు అనుకూలంగా అందరినీ కూడగట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బాధితురాలిగా చెబుతున్న మహిళ వేరే జాతికి చెందిన ప్రేమికుడితో కలిసి ఒక ఇంట్లో ఉండగా బయటకు లాక్కొచ్చిన మాట వాస్తవమే గానీ, అక్కడ కేవలం రాజీ మాత్రమే కుదుర్చుకున్నాం తప్ప.. ఆమెపై అత్యాచారం చేయాల్సిందిగా ఎలాంటి తీర్పూ ఇవ్వలేదన్నారు. కేవలం తమ అంతర్గత న్యాయవ్యవస్థను తప్పుపట్టడానికే ఇలాంటి ఆరోపణలు చేశారన్నారు.