అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు
► పెండింగ్ కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలి
► జేసీ శ్రీకేశ్ బి. లఠ్కర్
విజయనగరం కంటోన్మెంట్ : అర్హులందరికీ గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాలని జేసీ శ్రీకేశ్ బి.లఠ్కర్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న దీపం కనెక్షన్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలన్నారు. సుమారు 4.78 లక్షల కార్డుదారులకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో దీపం పథకం కనెక్షన్లపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు మార్చిలోగా గ్యాస్ కనెక్షన్లు అందించాలన్నారు. ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు ప్రభుత్వ నిబంధనల మేరకు ఐదు కిలోల గ్యాస్ సిలిండర్‌తో కూడిన స్టవ్‌ను అందించాలన్నారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించడానికి గ్రామస్థాయి అధికారులు, రేషన్ డీలర్ల సహకారం తీసుకోవాలని సూచించారు. అలాగే ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధికార సర్వే గమనిస్తే ఎవరికి గ్యాస్ కనెక్షన్ లేదో తెలుస్తుందని చెప్పారు . జూన్ చివరి నాటికి అర్హులందరికీ కనెక్షన్లు మంజూరు చేసి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
దీపం కనెక్షన్లపై ప్రతి 15 రోజులకోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు. పెట్రోల్ బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీదారులు నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సమావేశంలో డీఎస్ఓ జె. శాంతికుమారి, ఏఎస్ఓ పి. నాగేశ్వరరావు, హెచ్‌పీసీఎల్ సేల్స్ మేనేజర్లు ఎం. చౌదరి, వివిధ గ్యాస్, ఆయిల్ కంపెనీల ప్రతినిధులు శ్రీధర్ రాజా, డీలర్లు శ్రీనివాసరావు, టి. సీతారామయ్య, రామకృష్ణ, వినియోగదారుల సంక్షేమ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.