8 మంది టీచర్ల జీతాలు నిలిపివేత
యలమంచిలి : లక్షలాది రూపాయలు ఖర్చు చేసి శిక్షణ ఇస్తుంటే ఉపాధ్యాయులు నిర్లక్ష్యం చూపుతున్నారు... పాఠశాలలకు సకాలంలో విధులకు హాజరుకావడం లేదు... చిత్తశుద్ధితో విద్యాబోధన చేపట్టడం లేదు... ఇదా పనిచేసే తీరు అంటూ.. యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి ఉపాధ్యాయులపై మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యలమంచిలి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో రాంబిల్లి, ఎస్.రాయవరం, యలమంచిలి మండలాల ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల హాజరును పరిశీలించారు. రాంబిల్లి మండలానికి చెందిన 8 మంది ఉపాధ్యాయులు ఆ సమయంలో శిక్షణకు హాజరుకాకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోతే ఎలా అని ప్రశ్నించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే తప్ప ఉపాధ్యాయుల్లో మార్పు రావడం లేదన్నారు. శిక్షణకు హాజరుకాని ఎనిమిది మంది ఉపాధ్యాయులకు ఈ నెల జీతం నిలిపివేయాలని రాంబిల్లి ఎంఈవోను ఆదేశించారు. నిర్లక్ష్యాన్ని సహిం చేది లేదని హెచ్చరించారు. అనంతరం బాలికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. రూ.30లక్షల సర్వశిక్షాభియాన్ నిధులతో బాలికోన్నత పాఠశాలలో 6 గదులు నిర్మించనున్నట్టు చెప్పారు. ఇందుకోసం పాత భవనాలను కూల్చేందుకు అనుమతి కోసం డీఈవోకు లేఖరాసినట్టు తెలిపారు. డీఈవో నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు.