వైఎస్సార్సీపీలోకి బొబ్బిలి కాంగ్రెస్ నాయకులు
* పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన అధినేత
* నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ
బొబ్బిలి : బొబ్బిలి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులు శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరారు. పార్టీ జిల్లా నాయకుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) ఆధ్వర్యంలో వీరందరికీ హైదరాబాద్లోని లోటస్పాండ్లో గల తన నివాసంలో పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ, మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఇంటి గోపాలరావు, సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్, పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సావు కృష్ణమూర్తినాయుడు, 12వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ లక్ష్మి భర్త దమ్మా అప్పారావు, 28వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ రేజేటి కృష్ణవేణి కుమారుడు విశ్వేశ్వరరావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మునకాల కృష్ణారావు, పాలవలస ఉమాశంకరరావు, ఇంటి గోవిందరావుతో పాటు యువజన నాయకుడు దిబ్బ గోపీ పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా ఇంటి గోపాలరావు మాట్లాడుతూ వై.ఎస్.జగన్ నాయకత్వ లక్షణాలు, పార్టీ సిద్ధాం తాలు, ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ, చిన్న శ్రీనుల నాయకత్వంలో జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకూ క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత పటిష్ట పరుస్తామని తెలిపారు.