boday
-
మీ బరువు సాధారణంగానే ఉన్నా.. పొట్ట పెద్దదిగా ఉంటే?
మీ శరీరం బరువు ఉండాల్సినంతే ఉన్నప్పటికీ... మీ పొట్ట పెద్దగా బయటకు కనిపిస్తూ ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన కండిషన్ అని గుర్తుంచుకోండి. మీరు మీ పొట్ట దగ్గర అంటే నడుము చుట్టుకొలతను ఓ టేప్ సహాయంతో తీసుకోండి. ఇలా కొలిచే క్రమంలో బొడ్డుకు ఒక అంగుళంపైనే కొలవాలని గుర్తుంచుకోండి. ఆ కొలతకూ, పిరుదుల మధ్య (హిప్)లో... గరిష్ఠమైన కొలత వచ్చే చోట టేప్‌తో మరోసారి కొలవండి. ఈ రెండు కొలతల నిష్పత్తిని లెక్కగట్టండి. అంటే నడుం కొలతని హిప్ కొలతతో భాగించాలన్నమాట. అది ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే (అంటే జీరో పాయింట్ డెసిమల్స్‌లో) వస్తుంది. సాధారణంగా నడుము కొలత, హిప్స్ భాగం కొలత కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. సాధారణంగా మహిళల్లో ఈ కొలత విలువ 0.85 కంటే తక్కువగా ఉండాలి. అలాగే పురుషుల విషయానికి వస్తే ఇది 0.90 కంటే తక్కువ రావాలి. ఈ నిష్పత్తినే డబ్ల్యూహెచ్ఆర్ (వేయిస్ట్ బై హిప్ రేషియో) అంటారు. పైన పేర్కొన్న ప్రామాణిక కొలతల కంటే ఎక్కువగా వస్తే ... అంటే... ఈ రేషియో విలువ... మహిళల్లో 0.86 కంటే ఎక్కువగానూ, పురుషులలో 0.95 కంటే ఎక్కువగా ఉంటే అది ఒకింత ప్రమాదకరమైన పరిస్థితి అని గుర్తుంచుకోండి. అలా కొలతలు ఎక్కువగా ఉన్నాయంటే వారికి ‘అబ్డామినల్ ఒబేసిటీ’ ఉందనడానికి అదో సూచన. దీన్నే సెంట్రల్ ఒబేసిటీ అని కూడా అంటారు. ఇలా అబ్డామినల్ ఒబేసిటీ లేదా సెంట్రల్ ఒబేసిటీ ఉన్నవారికి గుండె సమస్యలు / గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే ఈ నిష్పత్తి (వేయిస్ట్ బై హిప్ రేషియో) ఉండాల్సిన ప్రామాణిక విలువల కన్నా ఎక్కువగా ఉన్నవారు వాకింగ్ లేదా శరీరానికి ఎక్కువగా శ్రమ కలిగించని వ్యాయామాలతో పొట్టను అంటే నడుము చుట్టుకొలతను తగ్గించుకోవడం అన్ని విధాలా మేలు. -
అవయవదానంపై ఆదర్శ ‘మార్గం’
460 కి.మీ. నడుచుకుంటూ గుంటూరుకు వచ్చిన కడప వాసి గుంటూరు మెడికల్: రమేష్‌రెడ్డి.. అవయవదానం వల్ల ఈ రోజు ప్రాణాలతో ఉన్నాడు. తన లాగా ప్రాణాపాయస్థితిలో ఉన్న వారిని రక్షించడానికి.. ప్రాణాలు పోయిన తరువాత కూడా ‘ఇతరుల్లో’ బతకడానికి అవయవదానం ఎంత అవసరమో తెలియజేయడానికి నడుం బిగించాడు ఈ వైఎస్సార్ జిల్లా వాసి. ప్రజల్లో అవయవదానంపై ఉన్న అపోహలు తొలగించి వారికి అవగాహన కల్పించేందుకు ప్రొద్దుటూరుకు చెందిన కొవ్వూరు రమేష్‌రెడ్డి కాలినడకన తిరుపతి నుంచి బయలుదేరి దారిపొడవునా ప్రతి ఒక్కరికీ అవయవదానంపై అవగాహన కల్పిస్తూ మంగళవారం గుంటూరు వచ్చారు. ఫిబ్రవరి 12న తిరుపతిలో బయలుదేరిన రమేష్‌రెడ్డి 460 కిలోమీటర్ల ‘స్ఫూర్తి మార్గం’ అనంతరం గుంటూరు రావడంతో పలువురు వైద్యులు ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా రమేష్‌రెడ్డి మాట్లాడుతూ లివర్ వ్యాధితో బాధపడుతున్న తాను 2003లో లివర్ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నానని నేటికి 13 ఏళ్లు గడుస్తున్నా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పారు. 2009లో కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కూడా జరిగిందని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదని, ప్రజలు అవయవదానంపై అపోహలు వీడాలని పిలుపునిచ్చారు. సన్మాన కార్యక్రమంలో వేదంత మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్ గొంది శివరామకృష్ణ, డాక్టర్ డేగల వాణి తదితరులు పాల్గొన్నారు.