వన్డే చైర్మన్‌గా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపల్ డెలిగేట్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీ కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్య ఎన్నికయ్యారు. ఒక్కరోజు చైర్మన్ హోదాలో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఆది నుంచి వివాదాస్పదంగా సాగుతున్న శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో మొత్తం 35 మంది కౌన్సిలర్లు ఉండగా వారిలో 21 వుంది టీడీపీ, 11 మంది వైఎస్సార్సీపీ, మరో ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు కొనసాగుతున్నారు.
బుధవారం జరిగిన అత్యవసర సమావేశానికి చైర్మన్, వైస్ చైర్మన్ సహా టీడీపీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. అంతే కాకుండా ప్యానెల్ కమిటీ సభ్యులు (నలుగురు) కూడా సమావేశానికి రాలేదు. వైఎస్సార్ సీపీకి చెందిన 11 మంది సమావేశానికి హాజరయ్యారు. బీజేపీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లలో 11వ వార్డుకు చెందిన లత, 13వ వార్డు కౌన్సిలర్ పుష్ప హాజరయ్యారు. అయితే టీడీపీ ఒత్తిళ్లతో 13వ వార్డు కౌన్సిలర్ పుష్ప మినిట్స్ పుస్తకంలో సంతకం చేయకుండా అర్ధాంతరంగా సమావేశం నుంచి వెళ్లిపోయారు. 11వ వార్డు కౌన్సిలర్ లత మాత్రం సమావేశంలోనే కొనసాగడంతో కోరానికి అవసరమైన బలం చేకూరింది. దీంతో సమావేశం నిర్వహించి తీరాలని మున్సిపల్ కమిషనర్ శ్రీరామశర్మను వైఎస్సార్సీపీ కోరింది.
అయితే ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సమావేశానికి ఆలస్యంగా వచ్చారని సమావేశం వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించి సభ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు సమావేశ మందిరంలోకి చేరుకుని సంతకాలు పెట్టడానికి ప్రయత్నించారు. కమిషనర్ మినిట్స్ పుస్తకాన్ని ఇచ్చేందుకు నిరాకరించారు. కోరానికి కావాల్సిన కౌన్సిలర్లు సమావేశానికి వచ్చారని, వారందరి చేత ఎందుకు సంతకాలు చేయించరని కమిషనర్‌తో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో సీఐ వేణుగోపాల్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.
తర్వాత కమిషనర్ మినిట్స్ పుస్తకాన్ని ఇవ్వడంతో వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కూడా సంతకాలు పెట్టారు. ఆ మేరకు వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, వైస్ ఫ్లోర్ లీడర్ గుమ్మడి బాలకృష్ణయ్య నేతృత్వంలో డెలిగేట్ మున్సిపల్ చైర్మన్‌గా 22వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బొద్దులూరు ధర్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకుని సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలోని 46 అంశాలను ఆమోదిస్తున్నట్లు తీర్మానం చేశారు. ఒకరోజు చైర్మన్‌గా పాలకవర్గాన్ని కాదని విపక్ష సభ్యుడు బాధ్యతలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.