ఎన్ఆర్ఐ అనుమానాస్పద మృతి
అదృశ్యమైన ఐదు రోజులకు మృతదేహం లభ్యం
హైదరాబాద్: నగరంలో ఓ ఎన్ఆర్ఐ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంటి నుంచి వాకింగ్‌కని వెళ్లి ఐదు రోజుల తర్వాత శవమై కనిపించాడు. బోయిన్పల్లి పోలీసుల కథనం ప్రకారం...పాత బోయిన్పల్లి రాజారెడ్డి కాలనీకి చెందిన గౌతమ్‌రెడ్డి (30) ఎనిమిదేళ్ల క్రితం కెన్యా వెళ్లి వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. అతనికి ఎనిమిది నెలల క్రితం కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన యామినితో వివాహమైంది. గౌతమ్‌రెడ్డి గత నెల 29న కెన్యా నుంచి రాజారెడ్డి కాలనీలోని తన ఇంటికి వచ్చాడు. అదే రోజు రాత్రి 7.20కి వాకింగ్‌కు వెళ్లొస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు 30న బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని డెయిరీ ఫారం వద్ద చెట్ల పొదల్లో ఒంటిపై దుస్తులు కాలిపోయి, కుళ్లిన స్థితిలో ఓ మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకొని చూడగా మృతదేహం పక్కనే ఖాళీ పెట్రోల్ బాటిల్, ఓ పర్సు పడి ఉన్నాయి. పర్సు ఆధారంగా మృతుడిని ఎన్ఆర్ఐ గౌతమ్‌రెడ్డిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గౌతమ్‌రెడ్డికి నగరంలో శత్రువులెవరూ లేరని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఏం జరిగి ఉంటుంది?
గౌతమ్‌రెడ్డి మృతిపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. గత నెల 29న సాయంత్రం ఇంటికి చేరుకున్న గౌతమ్‌రెడ్డి.. ఇంట్లో ఉన్న మూడు గంటల్లో ఏదైనా సంఘటన జరిగిందా అని అనుమానిస్తున్నారు. ఈ విషయంపై మృతుడి భార్య, ఇతర కుటుంబ సభ్యులు నోరు విప్పితేనే అసలు విషయం బయటకు వస్తుందంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు గౌతమ్‌రెడ్డి సెల్‌ఫోన్ పట్టుకెళ్లాడని, వాచ్ ధరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తొలుత పేర్కొన్న కుటుంబ సభ్యులు ఆ తర్వాత సెల్‌ఫోన్ తీసుకెళ్లలేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.