పిల్లలు చెప్పలేరు పెద్దలే తెలుసుకోవాలి
ఎవరినైనా చూసి మన పాప/బాబు హడలిపోతుంటే... దానికి కారణం చిన్నపిల్లల్లో సహజంగా ఉండే బెరుకు కావచ్చు అనుకుంటాం మనం. అంతేతప్ప, అది అసహజమైన భయం కావచ్చునన్న ఆలోచనే రాదు. ‘‘ఇక్కడే చాలామంది తల్లులు తప్పు చేస్తున్నారు’’ అంటోంది హైదరాబాద్లోని ‘బ్రేక్ ద సెలైన్స’ సంస్థ.
శిశుహింస (చైల్డ్ అబ్యూజ్) అనేక విధాలుగా ఉంటుంది. పిల్లల్ని కొట్టడం, తిట్టడం, లైంగికంగా వేధించడం, ఏ పని చేసినా విమర్శించడం, కఠినమైన శిక్షలు విధించడం, ఆఖరికి ప్రేమ చూపకపోవడం కూడా శిశుహింసే. వీటిల్లో అతి ప్రధానమైన లైంగిక హింసను నివారించేందుకు ‘బ్రేక్ ద సెలైన్స్’ సంస్థ కృషి చేస్తోంది. లైంగిక హింసకు బలవుతున్న చిన్నారులను కాపాడటానికి, ఈ హింస గురించి తల్లిదండ్రులకు, చిన్నారులకు అవగాహన కలిగించడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్న సంస్థ ఇది.
సంస్థ అంచనా ప్రకారం చిన్నపిల్లల పట్ల వేధింపులు రోజురోజుకీ పెరిగిపోవడానికి కారణాలు ముఖ్యంగా రెండు. పిల్లలు నోరు తెరచి తమ పట్ల జరుగుతోన్న హింసను చెప్పలేకపోవడం, పిల్లల విషయంలో ఏం జరుగుతుందో పేరెంట్స్ గుర్తించలేకపోవడం. ఈ పరిస్థితి మారాలంటే... తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ముందు తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలి, తర్వాత పిల్లలను అప్రమత్తం చేయాలి.
మీ ఇంటికి తరచుగా వచ్చేవారు, బడిలో టీచర్లు తదితరులు మీ పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. వాళ్ల ప్రవర్తనలో తేడా కనిపిస్తే వెంటనే జాగ్రత్తపడండి. అనుచితంగా ఉంటే వారించండి.
ఎలాంటి మనుషులు ఉంటారు, వారు ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తారు, లోబర్చుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు... వంటివి పిల్లలకు అర్థమయ్యే విధంగా వివరించండి. చిన్నపిల్లలు కదా అని చెప్పడానికి మీరు సంకోచిస్తే... రేపు జరగరానిది జరగవచ్చు.
పిల్లలు కనుక తమ పట్ల ఎవరైనా తప్పుగా ప్రవర్తిస్తున్నారని చెబితే తేలిగ్గా తీసి పారేయకండి. ‘నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా’ అంటూ కోప్పడకండి. అలా చేస్తే వాళ్లు ఇంకెప్పుడూ ఏమీ చెప్పరు. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది.
ఎప్పుడూ అల్లరిచేసే పిల్లలు మౌనంగా ఉండిపోయినా, భయం భయంగానో దిగులుగానో ఉంటున్నా విషయమేంటో ఆరా తీయండి.
తగని చోట టచ్ చేస్తున్నా, మీరు లేనప్పుడు తనని దగ్గరకు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నా, ఫొటోలూ వీడియోలూ తీయాలని ప్రయత్నిస్తున్నా... వెంటనే మీకు చెప్పమని మీ చిన్నారికి బోధించండి.
వీలైనంత వరకూ పిల్లలను పరాయివాళ్ల ఇళ్లలో వదిలిపెట్టడం, పరాయి వాళ్లతో బయటకు పంపడం చేయకండి.
పిల్లలు ఎక్కువగా గడిపేది తల్లితోనే. కాబట్టి వారిని అనుక్షణం తల్లే కంటికి రెప్పలా చూసుకోవాలి. తమకు ఏం జరుగుతోందో, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియని పసివాళ్లు వాళ్లు. కాబట్టి ప్రమాదం ఎటునుంచి వస్తుందో, ఎలా వస్తుందో వాళ్లకి అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదే.