పోరండ్లలో ఆదిమానవుల ఆనవాళ్లు
ఔత్సాహిక పురావస్తు పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్లలో ఆదిమానవుల ఆనవాళ్లు బయటపడ్డాయి. వరంగల్ జిల్లా కేంద్రంగా ఔత్సాహిక పురావస్తు పరిశోధనలు చేస్తున్న మానకొండూర్ మండలం గంగిపెల్లికి చెందిన రెడ్డి రత్నాకర్‌రెడ్డి ఇటీవల పోరండ్ల గ్రామాన్ని సందర్శించారు. గ్రామం ఆదిమానవులకు చిరునామా అనే పలు ఆధారాలను ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. పోరండ్లలోని పెద్ద గుట్టను కేంద్రంగా చేసుకుని పోరండ్ల, ముంజంపల్లి మధ్య నవీన శిలాయుగం, బృహద్ శిలాయుగాలకు చెందిన ఆదిమానవులు జీవించారని తెలిపారు.
నవీన శిలాయుగ ఆనవాళ్లు..
క్రీస్తు పూర్వం ఐదువేల ఏళ్ల క్రిత ంనవీన శిలాయుగపు నాటి రాతిగొడ్డళ్లు, ఎరుపు రంగుతో మెరిసే టైట మృణ్మయపాత్రలు, వృత్తాకారపు మట్టిబిళ్లలు, నలుపు, బూడిద రంగులో ఉన్న మృణ్మయపాత్రలు, రొట్టె పెంకలు, రోళ్లు, వడిసెల రాళ్లు, దంపుడు, నూరుడు రాళ్లు, పెద్దపెద్ద ఇటుకలు, సిమెంట్‌తో చేసినట్లుగా కనిపించే చిన్నచిన్న పీటలను ఇక్కడ ఉన్నట్లు రత్నాకర్‌రెడ్డి చూపిస్తున్నారు. చిన్న గుంటతో తొలచిన నల్లటిరాయి వీటిలో ప్రత్యేకమని తెలిపారు.
బృహద్ శిలాయుగం సమాధులు...
ఒకటిన్నర మీటర్ల పొడవు, వెడల్పు ఉండే పెద్దపెద్ద శిలలతో కూడిన బృహద్ శిలాయుగపు సమాధులు ఇక్కడ ఉన్నాయని గుర్తించారు. 14 శిలలతో 25 అడుగుల లోపలి వృత్తం కలిగిన భారీ సమాధి ఉన్నట్లు తెలిపారు. వందకుపైగా సమాధులుండగా... రైతులు వాటిని తొలగించినట్లు పేర్కొన్నారు. వాటిని స్థానికులు రాకాసి గూళ్లుగా పిలుస్తారని, ఇవి ఆవాస ప్రాంతాలను ఆనుకుని ఉన్నాయని చెప్పారు. ఐదు గుట్టలు ఆంగ్ల అక్షరం యూ ఆకారంలో ఉండగా వాటి మధ్య రాకాసి గూళ్లు, శిలలు అపారంగా ఉన్నాయన్నారు.
ఇనుము, రాతి పనిముట్లు
చిక్కం రాళ్లతోపాటు ముడి ఇనుముతో ఉన్న పెద్దపెద్ద రాళ్లు గుట్ట సమీపంలో కనిపించడం ఇక్కడి విశేషమని చెప్పారు. రాళ్ల పొరలు పొరలుగా ఉండి అరచేతిలో పట్టనంత పెద్దగా ఉన్నట్లు తెలిపారు. పలుగుడు రాయిని ఉపయోగించి చేసే అనేక రాతి పనిముట్లతోపాటు సేకరించి పెట్టుకున్న పెద్దపెద్ద పలుగుడు రాళ్లు ఉన్నాయి.
రాతిగొడ్డలి.. గుట్టపై గుహలు
ఎన్నో ఏళ్లుగా సాగులో ఉన్నప్పటికీ నవీన శిలాయుగానికి చెందిన రాతి గొడ్డలి లభించింది. పోరండ్ల గుట్టకు అడుగు భాగాన ఉన్న గుహలో నరసింహాస్వామి పూజలందుకుంటుండగా తలదాచుకునేందుకు పొడవైన పడగ రాయి ఉందన్నారు. స్థానిక నక్కలబండపై అనేక పనిముట్లు నూరుకునే గుర్తులు ఉండగా క్వారీలో పోయాయి. రెండు మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయని తెలిపారు. గుట్ట వద్ద ఆధారాలను పురావస్తు శాఖ పరిశోధిస్తే ఇక్కడ గొప్ప చరిత్ర ఉందని తెలుస్తుందని ఆయన కోరుతున్నారు.
శిలలపై చిత్రాలు...
పోరండ్ల నుంచి ముంజంపల్లి వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న ఒక శిలపై ఆదిమానవులు వేసిన మానవుని బొమ్మ స్పష్టంగా కనిపించిందని, అందు లో తల భాగమే అస్పష్టంగా ఉందని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. ఇలాంటి బొమ్మలు సామాన్యంగా బృహద్ శిలాయుగంలోనే కనిపించాయని వివరిం చారు. చాలా చోట్ల చిన్నచిన్న చిత్రాలే కనిపించగా, పోరండ్లలో పెద్దదిగా మానవ చిత్రం కనిపించడం విశేషంగా ఉందన్నారు. దీనిని చూసిన తరువాతే గుట్ట వద్దకు వెళ్లగా రాకాసి గూళ్లు కనిపించాయని ఆయన పేర్కొన్నారు. రాకాసి గూళ్లకు అనుబంధంగా సుమారు తొమ్మిది అడుగుల ఎత్తులో నిలువురాయిని పాతి ఉన్నట్లు పోరండ్ల, ముంజపల్లి శివారులో ఉన్న జిల్లేడు చెరువులో గుర్తించినట్లు ఆయన తెలిపారు.