ఏడీటీ చికిత్సతో డిప్రెషన్ ప్రమాదం
వాషింగ్టన్: ప్రొస్టేట్ క్యాన్సర్కు ఏడీటీ (ఆండ్రోజన్ డిప్రివేషన్ థెరపీ) అనే హర్మోన్ చికిత్సను వాడడం వల్ల వ్యాకులత (డిప్రెషన్) పెరుగుతుందని పరిశోధనలో తేలింది. దీంతోపాటు లైంగిక సామర్థ్యం కోల్పోవడం, బరువు పెరగడం, నీరసించిపోవడం వంటి చెడు ప్రభావాలు కూడా ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. ఈ పరిశోధనను అమెరికాలోని ‘బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్’ ఆసుపత్రి వారు చేశారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడి 1992 నుంచి 2006 వరకు ఏడీటీ చికిత్స తీసుకున్న, 65 ఏళ్లు పైబడిన 78,552 మంది పురుషుల వివరాలను సమీక్షించి ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏడీటీ తీసుకున్న వారు తీసుకోని వారి కన్నా 23 శాతం ఎక్కువ వ్యాకులత బారిన పడే అవకాశం ఉందని, ఎంత ఎక్కువ కాలం చికిత్స తీసుకుంటే అంత ఎక్కువ ప్రమాదమని పరిశోధనలో బయటపడింది.