తెలుగు చానల్ ప్రసారాల పైరసీ
జాదు టీవీ బాక్స్‌ల ద్వారా విదేశాల్లో ప్రసారాలు
ముఠా కార్యాలయంపై సీసీఎస్ పోలీసుల దాడి
హైదరాబాద్: తెలుగు చానల్స్ ప్రసారాలను పైరసీ చేసి విదేశాలలో ప్రసారాలు చేస్తూ కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న ఓ ముఠా గుట్టును నగర సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ముఠా నాయకుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి కంప్యూటర్లు, యూపీఎస్‌లు, డిష్‌లను స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. బోయిన్‌పల్లిలోని మానససరోవర్ అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్‌లో ఈ వ్యవహారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతానికే చెందిన మాజిద్ ‘జాదు టీవీ’ పేరుతో ఓ కార్యాలయాన్ని తెరిచాడు. టీవీలో ప్రసారమయ్యే అన్ని తెలుగు టీవీ చానల్స్‌ను డౌన్‌లింక్ చేసుకుని అదే ప్రసారాలను అప్‌లింక్ చేస్తున్నాడు. ఇతను పంపిస్తున్న ఔట్పుట్ కేవలం ఇతను సరఫరా చేసిన జాదు టీవీ బాక్స్‌ల ద్వారానే ప్రసారం అవుతాయి.
ఈ బాక్స్‌లను విదేశాలలోనే విక్రయించాడు. సుమారు 120 దేశాల్లో 300 డాలర్ల చొప్పున రెండు మిలియన్ల బాక్స్‌లను అమ్మినట్లు సమాచారం. అయితే తమ ప్రసారాలు లేని దేశాల్లోనూ కార్యక్రమాలు వస్తుండడంతో అనుమానం వచ్చిన పలు చానల్స్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చే శాయి. ఇన్స్పెక్టర్లు మాజిద్ అహ్మద్, కరుణాకర్‌రెడ్డిలు ఆరా తీయగా విషయం బయటపడింది. దీని సూత్రధారి జావెద్‌తో పాటు మరో నలుగురిని సీసీఎస్ పోలీసుల అరెస్టు చేయగా సుమిత్ హౌజా పరారీలో ఉన్నారు.