యూపీలో రాజకీయ హత్య.. కలకలం
లక్నో: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరిన కొద్ది గంటల్లోనే రాజకీయ హత్య జరిగింది. అలహాబాద్ జిల్లాలో బీఎస్పీ నాయకుడొకరు దారుణ హత్యకు గురయ్యారు. మావు అయిమా పట్టణంలో బీఎస్పీ నేత మహ్మద్ షమీని ఆదివారం రాత్రి బైకుపై వచ్చిన గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. సంఘటనా స్థలంలోనే షమీ ప్రాణాలు కోల్పోయారు. దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని, షమీ కుటుంబ సభ్యలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మద్దతుదారులు అలహాబాద్-ప్రతాప్ గఢ్ జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. నేర చరిత్ర కలిగిన షమీకి స్థానిక బీజేపీ, వీహెచ్ పీ నాయకులతో విభేదాలున్నాయని పోలీసులు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహ్మద్ షమీ.. సమాజ్ వాదీ పార్టీ నుంచి బీఎస్పీలో చేరారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది గంటల్లోనే రాజకీయ హత్య జరగడంతో యూపీలో కలకలం రేగింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోమని రాష్ట్ర మంత్రి శ్రీకాంత్ శర్మ హెచ్చరించారు. ప్రజాభద్రతే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యమని తెలిపారు.