షరతులతో మాయావతి సోదరుడికి కీలక పదవి
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్కు పార్టీలో కీలక పదవి కట్టబెట్టారు. బీఎస్పీ ఉపాధ్యక్షుడిగా ఆనంద్ కుమార్ను నియమించారు. బీఎస్పీలో మాయావతి తర్వాతి స్థానం ఆయనదే. అయితే ఎప్పటికీ ఎంపీ లేదా ఎమ్మెల్యే కాకూడదని, అలాగే మంత్రి, ముఖ్యమంత్రి పదవులు ఆశించరాదని మాయావతి తన సోదరుడికి షరతు విధించారు. ఆనంద్ కుమార్కు చెందిన కార్యాలయాలు, వ్యాపార సంస్థలపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. కాగా ఆయన ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేయలేదు. ఆనంద్ కుమార్ వ్యాపార లావాదేవీలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీఎస్పీ ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలోకి రాగా, ఎస్పీ రెండు, బీఎస్పీ మూడో స్థానానికి పరిమితమయ్యాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఈవీఎంలను టాంపరింగ్ చేశారన్న అంశంపై ఇతర పార్టీలతో కలసి పనిచేసేందుకు తనకు ఎలాంటి పరిమితులు లేవని మాయావతి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ వ్యతిరేక పార్టీలతో కలసి పనిచేస్తామని చెప్పారు. ఇటీవల వైద్యపరీక్షలు చేయించుకున్న తర్వాత మాయావతి తొలిసారి పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా టార్గెట్ చేస్తోందని విమర్శించారు. మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చక్కెర మిల్లులను అమ్మడం, స్మారక మందిరాలను నిర్మించడంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఆమె పైవిధంగా స్పందించారు.