మామూళ్లతోనే మనుగడ!
ఎక్సైజ్‌కు బడ్జెట్ నిల్.. ఖర్చులు పుల్
సీఎం పర్యటన నుంచి వీఐపీల బాధ్యత
మంజూరు కాని బిల్లులు
వార్షిక బడ్జెట్ రూ 1.5 లక్షలు
ఖర్చు రూ.15 లక్షలు
సాక్షి, విజయవాడ : ప్రభుత్వం పైసా విదిల్చకపోవడంతో నిత్యం కాసులతో కళకళలాడే ఎక్సైజ్ శాఖ మాముళ్లతోనే మనుగడ సాగించాల్సి వస్తోంది. వార్షిక బడ్జెట్ నామమాత్రంగా ఉండగా ఖర్చులు మాత్రం రూ. లక్షలు దాటుతున్నాయి. ఏటా మద్యం షాపుల టెండర్ల నిర్వహణ ద్వారా వందల కోట్ల ఆదాయం ఆర్జిస్తున్న ఎక్సైజ్ శాఖకు కనీసం తెల్ల కాగితాలు కొనడానికే నిధులు విడుదల కావడం లేదు. శాఖ పరంగా నిర్వహించే కార్యక్రమాలు మొదలుకుని వీఐపీల పర్యటనల వరకు అన్ని ఖర్చులు ఎక్సైజ్శాఖపైనే పడుతున్నాయని, పర్యవసానంగా ఎక్సైజ్ అధికారులు తీసుకునే మామూళ్ల నుంచే ఈ ఖర్చులు పెట్టాల్సి వస్తుందని సిబ్బంది వాపోతున్నారు.
గతేడాది నిర్వహించిన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్లు మొదలుకుని మొన్న జరిగిన సమాచార హక్కు కమిషనర్ పర్యటన వరకు ఆర్థిక భారమంతా ఎక్సైజ్శాఖపైనే పడింది. సాధారణంగా ప్రతియేటా స్టేషనరీ, ఇతర అఫీసు అవసరాల కోసం ఎక్సైజ్‌శాఖ జిల్లాకు రూ 1.5 లక్ష వరకు బడ్జెట్ మంజూరు చేస్తుంది. ఇది కాక అదర్ అఫీసు ఎక్స్పెండేచర్ (ఓఓఐ) కింద ఏడాదికి మరో రూ.50వేలు మంజూరు చేస్తారు. వీటిలోనే ఆ శాఖ మంత్రి పర్యటన ఖర్చు, ఇతర ముఖ్యుల పర్యటన ఖర్చు, ఇవికాక జిల్లాకు వచ్చే ఇతర వీఐపీల ప్రోటోకాల్ తదితర ఖర్చులన్నీ భరించాలి.
ప్రధానంగా గతేడాది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ ప్రకియ 40 రోజులపాటు జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జిల్లాలో సుమారు 190 మంది కానిస్టేబుళ్ల నియామకాలు జరిగాయి. దీనికి గానూ సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చు కాగా వీటిలో సుమారు రూ.1లక్ష మాత్రమే బిల్లు మంజూరు అయింది. మిగిలిన మొత్తం సంగతి సరేసరి. ఈ క్రమంలో కార్యాలయ సిబ్బంది, ముఖ్య అధికారులు తలాకొంత వేసుకుని ఖర్చును పంచుకున్నారు.
ఆ తర్వాత ఇటీవల నిర్వహించిన మద్యం షాపుల వేలం ప్రకియకు షామియానా, 30 వరకు కొత్త స్టీల్బాక్సులు, స్టేషనరీ , జిల్లాలోని అన్ని సర్కిళ్ల నుంచి వచ్చిన సిబ్బందికి భోజనాలు, టీలు ఇలా అన్ని కలిపి సుమారు రూ.రెండు లక్షలు ఖర్చయింది. అది కూడ ఉన్నతాధికారుల ఆదేశాలతో పెట్టిన ఖర్చు. ఇది జరిగి నెలరోజులు గడుస్తున్నా ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదు.
మామూళ్లతో వీఐపీలకు ఖర్చు....
ఇదిలా ఉంటే శాఖపరమైన ఖర్చుతోపాటు ఇతర ఖర్చుల తాకిడి ఎక్సైజ్‌కు అధికంగా ఉంటుంది. జిల్లా ఉన్నతాధికారులు ముఖ్యుల ప్రోటోకాల్ బాధ్యతలు ఎక్సైజ్‌కు కేటాయిస్తారు. ఒక్క వీఐపీ నగరానికి వచ్చి వెళితే ఎక్సైజ్‌కు సగటున రూ.10వేలు ఫైన్ పడినట్లే. ముఖ్యంగా రెండు నెలల కిత్రం జరిగిన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారసభకు తరలివచ్చిన కొందరు వీఐపీల ప్రోటోకాల్ బాధ్యతలను ఎక్సైజ్ శాఖకు కేటాయించారు.
దీంతో సుమారు రూ.ఆరు లక్షలు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎక్సైజ్‌శాఖ అధికారులు ఖర్చు చేయాల్సి వచ్చింది. దీనికి తోడు ఎక్సైజ్ మంత్రి జిల్లాకు చెందిన వ్యక్తే కావడంతో నెలకు సగటున నాలుగుసార్లైనా పర్యటన జరుగుతుంది. దీంతో మంత్రి పర్యటన ప్రోటోకాల్ ఖర్చు కూడ ఎక్సైజ్‌కు తప్పనిసరిగా మారింది. మొత్తంమీద ఆదాయ వనరుగా ఉన్న ఎక్సైజ్‌శాఖ బడ్జెట్ లోటుతో సతమతమవుతుంది.