హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
పామిడి (గుంతకల్లు) : పామిడిలో కొడ్డూరు రోడ్డులో ఉన్న అంకాలమ్మ, కుంటెమ్మ దేవతల తొమ్మిదో జాతరను పురస్కరించుకుని ఆలయ కమిటీ, గ్రామస్తుల ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్ర స్థాయి ఎద్దుల రాతిదూలం లాగుడు పోటీలు అట్టహాసంగా ప్రారంభించారు. తొలిసారిగా ఈపోటీలను ఫ్లడ్లైట్ల వెలుతురులో నిర్వహిస్తుండటం విశేషం. తొలిరోజు పాలపళ్ళ విభాగానికి సంబంధించి నిర్వహించిన ఈపోటీలో అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన 19గాన్ల ఎద్దులు పాల్గొన్నాయి. ఈ పోటీలను వైఎస్సార్ సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎం.వీరాంజనేయులు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పోటీల్లో విజేత వృషభాలకు మొదటి, రెండవ, మూడవ, నాల్గొవ, ఐదవ బహుమతిగా వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు, రూ.3వేలు చొప్పున ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ఆర్ఆర్ రమేష్ తెలిపారు. అలాగే న్యూ కేటగిరి విభాగంలో విజేత వృషభాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ బహుమతి వరుసగా రూ.40వేలు, రూ.30వేలు, రూ.20వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున కేటాయించామన్నారు. తొలిరోజు వృషభాల రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ వైయూ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బొల్లు వెంకట్రామిరెడ్డి, పార్టీ బీసీ సేవాదళ్ పట్టణ కన్వీనర్ చీమల నగేష్, పసుల నాగరాజు, సామ్యూల్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.