హైదరాబాద్‌లో బస్సు తయారీ ప్లాంట్
♦ రూ.250 కోట్లతో ఆరంభించనున్న డెక్కన్ ఆటో
♦ ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యం
♦ రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
♦ కంపెనీ చైర్మన్ ఎంఎస్ఆర్వీ ప్రసాద్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఆటోమొబైల్ రంగంలో ఉన్న డెక్కన్ ఆటో హైదరాబాద్ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో బస్‌ల తయారీ ప్లాంటును నెలకొల్పుతోంది. ఏటా 3,000 బస్‌ల తయారీ సామర్థ్యంతో రూ.250 కోట్లతో మెదక్ జిల్లా పటాన్చెరు దగ్గర ఇది ఏర్పాటయింది. ఏఆర్ఏఐ ధ్రువీకరణ ఉన్న ఈ ప్లాంటు వార్షిక సామర్థ్యం... వచ్చే ఆరేళ్లలో 6,000 యూనిట్లకు పెంచుతారు. 8 నుంచి 18 మీటర్ల పొడవున్న బస్‌లను ఈ ప్లాంటులో రూపొందిస్తారు. ఈ బస్సుల్ని ఆఫ్రికా, ఆసియా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని డెక్కన్ ఆటో చైర్మన్ ఎం.శివరామ వరప్రసాద్ తెలిపారు. చైనా ప్రభుత్వ కంపెనీ అయిన జోంగ్టాంగ్ సాంకేతిక సహకారంతో లగ్జరీ కోచ్‌లను తయారు చేస్తామన్నారు. తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు చేతుల మీదుగా శనివారం ప్లాంటును ప్రారంభిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలియజేశారు.
కరోనా బస్‌లు సైతం...డెక్కన్ ఆటో ఈ ప్లాంటు ద్వారా బస్‌ల తయారీలోకి అడుగు పెడుతోంది. ఇప్పటికే గ్రూప్ కంపెనీ అయిన కరోనా బస్ మాన్యుఫ్యాక్చరర్స్ ఈ విభాగంలో సేవలందిస్తోంది. కొత్త ప్లాంటులో కరోనా, డెక్కన్ బ్రాండ్ల బస్‌లను తయారు చేస్తామని కరోనా డెరైక్టర్ ఎం.బాలాజీ రావు ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు తెలిపారు.. డెక్కన్ బ్రాండ్ బస్ రూ.1 కోటి వరకు, కరోనా బస్ రూ.70 లక్షల వరకు ధర ఉంది.
సిమెంటు రంగంలోనూ...
శివరామ వరప్రసాద్‌కు కరోనాలో 51 శాతం, డెక్కన్ ఆటోలో 70 శాతంపైగా వాటా ఉంది. ఈయన ప్రమోటర్‌గా ఉన్న గ్రూప్ కంపెనీకి ఆఫ్రికాలో డైమండ్ బ్రాండ్‌తో 15 సిమెంటు ప్లాంట్లు ఉన్నాయి. పశ్చిమ ఆఫ్రికాలో అత్యధిక వాటా ఈ బ్రాండ్‌దే. స్టీల్ ప్లాంటులతో పాటు టోగో దేశంలో రైల్వేలను నిర్వహిస్తోంది. ఆఫ్రికాలోనే 2,000 ఎకరాల్లో ఉప్పు పండిస్తోంది. హైదరాబాద్‌లో తొలి స్టూడియో అయిన సారధి స్టూడియోస్ కూడా ఈ గ్రూప్‌నకు చెందినదే. ఒరిస్సాలో తోషాలి బ్రాండ్‌తో సిమెంటు ప్లాంటు ఉంది. వైజాగ్ వద్ద వోల్టా ఫ్యాషన్స్ పేరుతో గార్మెంట్స్ తయారీ యూనిట్ ఉంది. పెపే జీన్స్, ఓనీల్, కిలివాచ్, ఏసాస్, సియా హెరింగ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు దుస్తులను సరఫరా చేస్తోం ది. గ్రూప్ టర్నోవర్ రూ.10,700 కోట్లపైమాటే.